ఎమ్మెల్యే తలారి వైఖరిపైనే ఆరోపణలు గోపాలపురం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దగా రాజకీయ అలికిడి లేని నియోజకవర్గం. ఇటీవల జికొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యతో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొచ్చింది గోపాలపురం. వైసీపీలోని గ్రూప్‌వార్ హత్యకు కారణం ఒక సంచలనమైతే.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో గోపాలపురంలో ఏం జరుగుతుంది? అక్కడ అధికారపార్టీలో వర్గపోరు చంపుకొనే స్థాయిలో ఉందా? అయితే దానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ద్వారకా తిరుమల, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుసుకుని నివ్వెర పోతున్నాయి పార్టీ వర్గాలు. దీనికంతటికీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వైఖరి కారణమనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్స్‌గా పోటీ చేసినవాళ్లు గెలవడంతో వర్గపోరు ఎక్కువైంది. వైసీపీ నేతలు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. వీటి గురించి సమాచారం ఉన్నా.. ఎమ్మెల్యే తలారి చూసీచూడనట్టు వదిలేసేవారని ఆరోపిస్తున్నారు.
ఆ వైఖరి వల్లే గంజి ప్రసాద్ హత్య జరిగిందనేది వారి వాదన. గ్రామాల్లో వర్గ విభేదాలు.. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే అవకాశం వచ్చినా.. అలాంటి సమావేశాలకు తలారి దూరంగా ఉండేవారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం గోపాలపురంలో వివిధ పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చినవాళ్లంతా ఒక గ్రూపు.. మొదటి నుంచి వైసీపీలో ఉన్న వాళ్లు మరో గ్రూపు.. ఎమ్మెల్యే అనుచరగణంగా చెప్పుకొనేవాళ్లు ఇంకో గ్రూపుగా రాజకీయం చేస్తున్నారు. వీరిలో వీళ్లకే పడదు. అంతా కలిసి పనిచేసే పరిస్థితులు ఎదురైనా.. వారిని సమన్వయ పరిచేవాళ్లు కరువయ్యారు. దాంతో సమస్యలు ముదురుపాకన పడ్డాయి.
గోదావరి జిల్లాలోని ప్రశాంత రాజకీయ వాతావరణం కాస్తా.. ఎమ్మెల్యేను తరిమి తరిమి కొట్టే పరిస్థితికి రావడం కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ వర్గాల్లోనే అసంతృప్తి ఉందట. అధికారపార్టీలో గ్రూపు రాజకీయాలు సాధారణమే అయినా.. వారి మధ్య సయోధ్య చేయాల్సిన ఎమ్మెల్యే తలారి.. తనకు నచ్చిన మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం పార్టీ పెద్దలను ఆశ్చర్యపరుస్తోందట. ఆ వర్గం ద్వారానే ఎమ్మెల్యే తనకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారనే ఫిర్యాదులు వెళ్లాయట. జి. కొత్తపల్లి ఘటన తర్వాత గోపాలపురం వైసీపీపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అంతా ఆయనే చేశారని.. పార్టీ వర్గాలు ఎమ్మెల్యేను కార్నర్ చేస్తుండటం ఆసక్తిగా మారింది. విచిత్రం ఏంటంటే.. తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలని మళ్లీ గ్రూపులు కట్టి చర్చించుకుంటున్నారట గోపాలపురం వైసీపీ నాయకులు.
