NTV Telugu Site icon

Munugode Assembly constituency : మునుగోడులో ఓట్లు బంగారం కాసులు కురిపించనున్నాయా?

Munugode

Munugode

Munugode Assembly constituency

మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ.. మునుగోడులో మాత్రం ఓట్లు బంగారం కాసులు కురిపించబోతున్నాయి. అక్కడ జనాలంతా నీ ఇల్లు బంగారంగాను పాట పాడుకునేందుకు రెడీగా ఉన్నారట. బైఎలక్షన్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న నాయకులు ఇంటికో తులం బంగారం ఇవ్వడానికి సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది.

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ రాలేదు. ఒకవేళ తేదీ ఖరారైతే మాత్రం ఉపఎన్నిక ముగిసేలోపు నియోజకవర్గంలో చిత్ర విచిత్రాలకు ప్రధాన పార్టీలు పెద్ద పీట వేసేలా ఉన్నాయి. ఉపఎన్నిక వస్తే నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుంది.. రోడ్లు అద్దంలా మారతాయి అని ప్రచారం జరిగింది. అధికార పార్టీ మాత్రం అన్ని ఎన్నికల మాదిరే మునుగోడును చూస్తోందట. పోల్ మేనేజ్‌మెంట్‌పైనే గులాబీ నేతలు ఫోకస్‌ పెట్టారట. ఓటర్ల కాళ్లా వేళ్లా పడైనా ఓట్లు అడగాలని డిసైడ్‌ అయ్యింది కాంగ్రెస్‌. ఓ అభ్యర్థి మాత్రం ఉపఎన్నికలో పెద్ద సాహసమే చేస్తున్నారట. ఎవరికి ఏం కావాలంటే అది అన్నట్టుగా వ్యవహారం నడిపిస్తున్నట్టు టాక్‌.

ఉపఎన్నిక వ్యూహాన్ని రోజు రోజుకూ మార్చేస్తున్నారు నాయకులు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలో దిగుతున్న రాజగోపాల్‌రెడ్డి, పట్టు సాధించాలని టీఆర్‌ఎస్‌, సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ చాలా ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. కాస్త పేరున్న నాయకులు.. గ్రామస్థాయిలో పలుకుబడి ఉన్న పెద్దలను వలేసి పట్టుకుంటున్నాయి పార్టీలు. నగదు కట్టలు ముందుపెట్టి వాళ్లను కొనేస్తున్న పరిస్థితి. కొందరికి ఖరీదైన కార్లు ఇచ్చారు. మరో 100 వరకు కార్లు బుక్‌ చేసి పెట్టారట. మరికొందరికి ఖరీదైన బైక్‌లు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్టు సమాచారం.

చౌటుప్పల్‌ మండలానికి చెందిన ఓ నాయకుడు.. హైదరాబాద్‌లో ఉండే ప్రత్యర్థి పార్టీ సభ్యుడికి ఫోన్‌ చేసి.. ‘మా పార్టీకి మద్దతు ఇవ్వమని మీ తమ్ముడికి చెప్పు అన్నా.. బైక్‌ ఇస్తాం’ అని ఆఫర్‌ పెట్టారట. దీంతో సొంత పార్టీ అభ్యర్థిపైనా బైక్‌ ఇవ్వాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయట. లీడర్లు వరకు ఒకే.. మరి ఓటర్ల సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. అమ్ముడు పోయిన నేతలు ఏ మేరకు తమ పరిధిలోని ఓటర్లు ప్రభావితం చేస్తారనే అనుమానం ఉందట. ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపైనే ప్రధాన పార్టీలు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయట. నియోజకవర్గంలోని 65 వేల కుటుంబాలకు తులం బంగారం చొప్పున ఇవ్వాలని ఓ అభ్యర్థి డిసైడ్‌ అయినట్టు టాక్‌. ఓటరు కోటీశ్వరుడైనా.. పేదవాడైనా.. అవేమీ చూడకుండా.. ఇంటికి తులం బంగారం ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారట. ఆ అభ్యర్థికి నమ్మకస్తుడైన ఓ వ్యక్తి ఇప్పటికే చౌటుప్పల్‌లో 14 కిలోల బంగారం పోగేసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని బేగంబజార్‌ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టు మునుగోడు నియోజకవర్గంలో కథలు కథలు చెప్పుకొంటున్నారు. ఇదంతా కుటుంబానికి తులం బంగారం చొప్పున ఇవ్వడానికి జరిగిన ఏర్పాట్లుగానే భావిస్తున్నారట. అయితే మునుగోడు నియోజకవర్గంలోని 65 వేల కుటుంబాలకు బంగారం పంపిణీ అంత ఈజీనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల్లో పోల్‌ మేనేజ్‌మెంట్ చేయడంలో దిట్టగా సదరు నాయకుడికి గుర్తింపు ఉంది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వర్కవుట్‌ చేస్తున్నారట. మరి..ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. తులం బంగారం చొప్పున పంచితే మాత్రం.. మునుగోడులోని జనం నీ ఇల్లు బంగారంగాను అని సాంగ్‌ వేసుకోవడం ఖాయం.