Site icon NTV Telugu

Annamreddy Adeep Raj :ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా.. ఆ ఒక్కసారికే..!

Vishaka Pendurthi

Vishaka Pendurthi

Annamreddy Adeep Raj : Whoever wins in that constituency.. Only for that time..!

ఆ నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. అక్కడ ఎవరు గెలిచినా వన్‌టైమ్‌ సెటిల్ మెంట్ తప్ప సెకండ్ చాన్స్ ఉండదని చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యేకూ ఆ గండం తప్పదనే ప్రచారం జరుగుతోంది. టికెట్‌ ఆశిస్తున్న సీనియర్ నేత సీన్లోకి రావడంతో ఎమ్మెల్యే ఫస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లినట్టు టాక్‌. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

అన్నంరెడ్డి అదీప్‌ రాజు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే. 2019లో ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే వరకు అదీప్‌ గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. కానీ.. వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తిని ఓడించడంతో హైలైట్‌ అయ్యారు అదీప్‌ రాజు. చిన్న వయసులో ఎమ్మెల్యే అయినప్పటికీ.. మూడేళ్లుగా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోవడంలో విఫలం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. గ్రూపు రాజకీయాల వల్ల పెందుర్తిలోని వైసీపీ సీనియర్లు ఎమ్మెల్యేకు దూరంగా జరిగారు.

జనాల్లోకి వెళ్లకపోవడం.. ప్రభుత్వ పథకాలు కొందరికే అందుతున్నాయనే అపవాదుతో అదీప్‌రాజుపై వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పెందుర్తిలో ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టినా.. అది ప్రచారానికే పరిమితమైందనే టాక్‌ ఉంది. ఎమ్మెల్యే బంధువుల దందాలపై టీడీపీ ప్రశ్నలు.. రాజకీయ సెగలు రేపుతున్నాయి. రాతి చెరువు విషయంలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాడితానం గ్రామాన్ని కాలుష్యం నుంచి 15 రోజుల్లో చర్యలు చేపట్టి బయట పడేస్తామని విశాఖ సభలో సీఎం జగన్‌ చెప్పినా.. ఆ సమస్య పరిష్కారం దిశగా అదీప్‌ రాజు చొరవ తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేకు మైనస్‌ మార్కులు వస్తున్నాయని.. గ్రాఫ్‌ పడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టమనే ప్రచారం జోరందుకుంది.

కాపు ఓటింగ్ ఎక్కువగా వున్న స్ధానం కావడంతో ఇక్కడ ప్రత్యామ్నాయం వెతుక్కోవడం అనివార్యమని వైసీపీ ఆలోచన చేసినట్టు భోగట్టా. అంతే మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సీన్లోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నుంచి… 2014లో యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల.. ఇటీవల సీఎం జగన్‌ను కలిసి వచ్చారు. ఆ తర్వాత పెందుర్తిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. అయితే పంచకర్ల హడావిడిపై ఎమ్మెల్యే అదీప్‌ రాజుకు చిర్రెత్తికొస్తోందట. అది కాస్తా బయట పెట్టేసుకున్నారు. పంచకర్లపై సెటైర్లు పేల్చారు. పంచకర్లను తాము వైసీపీ నేతగా పరిగణించడం లేదని.. తాము జగన్‌ సైనికులమైతే.. ఆయన జనసైనికుడని కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఎమ్మెల్యేపై వైపీసీ పెద్దలు సీరియస్‌ అయ్యారట. ఉమ్మడి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారట పంచకర్ల. దాంతో అదీప్‌ రాజును సుబ్బారెడ్డి గట్టిగా మందలించినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇంకోవైపు అదీప్‌ రాజు అభ్యర్థి అయితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని టీడీపీ నేతలు లెక్క లేస్తున్నారట. దాంతో వైసీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని సమాచారం. మొత్తానికి పెందుర్తి ఎపిసోడ్‌లో మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు ఎక్కువ బాధపడినట్టుగా ఉందని ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నేతలు.

 

Exit mobile version