Site icon NTV Telugu

Ushashri Charan : ఆ మంత్రికి కునుకు లేకుండా చేస్తుంది ఎవరు..?

Usha Sri Charan

Usha Sri Charan

Ushashri Charan : ఆ మంత్రి నియోజకవర్గంలో ఎంత చెబితే అంత. కానీ.. సొంత గూటిలో అంతేస్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఇంతలో కావాలని చేశారో ఏమో.. కొత్త ప్రచారం మొదలై.. అమాత్యుల వారికి కనుకు లేకుండా చేస్తోందట. ఆ మినిస్టర్‌ ఎవరో.. ఆ గోల ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

ఉషాశ్రీచరణ్‌. ఏపీ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి. కల్యాణదుర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ మూడేళ్లకాలంలో ప్రత్యర్థులతోపాటు.. స్వపక్ష నాయకులు పైచెయ్యి సాధించాలని చూశారు. ఈ రగడ పీక్స్‌లో ఉన్న సమయంలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గంలో ఛాన్స్‌ కొట్టేశారు ఉషాశ్రీచరణ్‌. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం కల్యాణదుర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మంత్రి. అయితే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ ప్రచారం మినిస్టర్‌ను కలవర పెడుతోందట. దాని చుట్టూనే ప్రస్తుతం నియోజకవర్గంలో.. మంత్రి శిబిరంలో హాట్ హాట్‌ చర్చ సాగుతోంది.

ఉషాశ్రీచరణ్‌ కల్యాణదుర్గం వదిలేసి వచ్చే ఎన్నికల్లో హిందూపురం వెళ్లిపోతారనేది ఆ ప్రచార సారాంశం. అదీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్షణాల్లోనే నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారిపోయింది కూడా. హిందూపురం ఎందుకు వెళ్లిపోతున్నారో కూడా ఆ ప్రచారంలో విశ్లేషిస్తుండటంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. కల్యాణదుర్గం వైసీపీలో మంత్రి యాంటీ గ్రూప్‌ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు కల్యాణదుర్గంలో సహకరించే పరిస్థితి లేదట. అందుకే హిందూపురం వెళ్లిపోతున్నారని ఊదరగొట్టేస్తున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌, పార్టీ సీనియర్ నేత నవీన్‌ నిశ్చల్‌కు పడటం లేదు. ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. అందుకే ఉషాశ్రీచరణ్‌ను అక్కడి పంపుతారని ఆ ప్రచారంలో వెల్లడిస్తున్నారు. ఇందులో సాధ్యా సాధ్యాలు ఎలా ఉన్నప్పటికీ మంత్రి శిబిరం మాత్రం చాలా గుర్రుగా ఉందట.

కల్యాణదుర్గం వైసీపీలో తానంటే గిట్టని వాళ్లే ఈ ప్రచారం చేస్తున్నారనేది మంత్రి ఉషాశ్రీచరణ్‌ వాదన. కల్యాణదుర్గం వదిలేది లేదని.. హిందూపురం వెళ్లేదీ లేదని చెబుతున్నారట. హిందూపురంలో సామాజికవర్గం పరంగా కానీ.. ప్రాంతాల పరంగా లెక్కలేసుకున్నా.. ఉషాశ్రీచరణ్‌కు సెట్‌ కాని పరిస్థితి. అందుకే పార్టీ ఆమెను అక్కడికి పంపబోదని చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తొలుత మంత్రి లైట్‌ తీసుకున్నా.. చర్చ జోరందుకోవడంతో పెదవి విప్పక తప్పలేదు.

తనకు రాజకీయంగా అవకాశం కల్పించింది.. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది కల్యాణదుర్గమే కాబ్టటి.. నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేది లేదని ఉషాశ్రీచరణ్‌ చెబుతున్నారట. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మోద్దని ఆమె కోరుతున్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని.. వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మండిపడుతున్నారు. మొత్తానికి హిందూపురం ప్రచారం బయటకు ఎలా వచ్చిందో కానీ.. మంత్రి ఉషాశ్రీచరణ్‌ స్పందించక తప్పలేదు. ఈ గందరగోళానికి కారణమైన వాళ్లు ఎవరా అని మినిస్టర్‌ ఆరా తీస్తున్నారట. మొత్తానికి మూడేళ్లుగా నియోజకవర్గంలో ఇబ్బందులను ఎదుర్కొన్నది ఒక తీరు అయితే.. ఇప్పుడు మంత్రిగా ఫేస్‌ చేస్తున్న సవాళ్లు మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట.

 

Exit mobile version