Site icon NTV Telugu

తెరవెనక జేసీ మంత్రాంగం నడుపుతున్నారు…?

రాయల తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో వినిపించిన మాట. అప్పట్లో జేసీ దివాకర్‌రెడ్డి రాయల తెలంగాణ కోసం గట్టిగానే వాదించారు. ఆయన డిమాండ్‌ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు అదే పాటను కొత్తగా అందుకున్నారు జేసీ. ఎందుకలా? జేసీ ఆశిస్తున్నదేంటి? తెరవెనక ఎలాంటి మంత్రాంగం నడుపుతున్నారు?

జేసీ మరోసారి రాయల తెలంగాణ చర్చకు పెడుతున్నారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు నిర్ణయం తీసుకున్న సమయంలో సమైక్య ఆంధ్ర కోసం కొందరు ఉద్యమిస్తే.. మరికొందరు రాయల తెలంగాణ పల్లవి అందుకున్నారు. రాయల తెలంగాణ అవసరమని నాడు గట్టిగా వాదించారు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. తెలంగాణలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నది అప్పటి డిమాండ్‌. చివరకు పది జిల్లాలతో తెలంగాణ ఏర్పాటైతే.. 13 జిల్లాలతో సరిపెట్టుకుంది ఆంధ్రప్రదేశ్‌. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు భవిష్యత్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి రాయల తెలంగాణ చర్చ మెల్లగా ప్రచారంలోకి వస్తోంది. ఈ చర్చకు జేసీ దివాకర్‌రెడ్డే మూల కారణం కావడంతో ఆసక్తి కలిగిస్తోంది.

సీమ నేతలు తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్నారా?

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం తీవ్రంగా ఉంది. అందులో శ్రీశైలం జలాశయం కీలకం. కృష్ణా జలాల పంపకాలపైనా వివాదం చల్లారలేదు. తుంగభద్ర జలాలు, ఆర్డీఎస్‌లపైనా అంతే. తెలంగాణ, కర్నూలు జిల్లాల మధ్య గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయాలని కొందరు తాజాగా చర్చలు జరుపుతున్నారట. సీమకు చెందిన నేతలు.. తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్నట్టు సమాచారం.

అనంతపురం, కర్నూలు జిల్లా నేతలతో జేసీ మంతనాలు..?

అప్పట్లో రాయల తెలంగాణ వాదనను భుజానకెత్తుకున్న జేసీ దివాకర్‌రెడ్డే ఈ అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దగ్గర కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లా నేతలతో మంతనాలు చేస్తున్నారట. ఈ జిల్లాలకు చెందిన ముఖ్యనేతలను వ్యక్తిగతంగా కలిసి రాయల తెలంగాణ వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీమలోని ఈ రెండు జిల్లాలను కర్ణాటకలో కలపాలని కోరేవారూ ఉన్నారు.

రాయల తెలంగాణ వాదన వెనక రాజకీయ ప్రయోజనాలు?

రాయల తెలంగాణ వాదన వెనక జలవివాదాల పరిష్కారం, అభివృద్ధే కారణాలా లేక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. తాజా చర్చపై ఈ రెండు జిల్లాల్లో ప్రజల స్పందన ఎలా ఉంది? అన్ని పార్టీల నేతలు మద్దతు ఇస్తారా? అనే అంశాలపై JC ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారట. తెలంగాణలో టీఆర్‌ఎస్‌.. ఇతర పార్టీల నేతల ఆమోదం ఉంటుందా..? టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతలు సానుకూలంగా ఉన్నారనే వాదనలో నిజమెంత? అన్నది మరో చర్చ. ఇప్పుడు ఎవరి రాష్ట్రం వాళ్లదే. ఈ దశలో సీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపేందుకు సీఎం కేసీఆర్ మద్దతిస్తారా సందేహాలు ఉన్నాయట. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. రాయల తెలంగాణ నినాదం వెనక అసలు లోగుట్టు ఏంటన్నది చూడాలి. ఈ విషయంలో జేసీ ప్రయత్నాల బలమెంతో కాలమే చెప్పాలి.

Exit mobile version