Site icon NTV Telugu

GHMC Commissioner Lokesh Kumar : GHMC కమిషనర్ లోకేష్ కుమార్ ఎక్కడ ?

Ghmc

Ghmc

GHMC కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ లొకేషన్‌ ఎక్కడ? హైదరాబాద్‌లో వరస ప్రమాదాలు జరుగుతున్నా.. వరదలు ముంచెత్తుతున్నా పత్తా లేరా? క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల విమర్శలు వస్తున్నా కమిషనర్‌ ఎందుకు స్పందించడం లేదు?

భారీ వర్షాలకు.. హైదరాబాద్‌లో రోడ్లు నదులుగా మారుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బోయిగూడలో అగ్రిప్రమాదం జరిగి వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరికొన్ని ప్రాణాలు బుగ్గి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖలు.. సహాయక బృందాలు ఫీల్డ్‌లో కనిపించాయి కానీ.. GHMC కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఏమయ్యారు అనేది ప్రజాప్రతినిధుల ప్రశ్న. గడిచిన మూడేళ్లుగా సిటీలో పెద్ద ప్రమాదాలు జరిగినా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్కర కాలంలో ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన GHMC అధికారులు ఏమయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బోయిగూడ తుక్కు గోదాంలో అగ్నిప్రమాదం జరిగి బీహార్‌కు చెందిన 11 మంది వలస కార్మికులు చనిపోయారు. ఆ సమయంలోనూ GHMC కమిషనర్‌ ప్రమాద ప్రాంతానికి రాలేదు. సీఎస్‌, కేంద్ర మంత్రి అక్కడికి వచ్చినా కమిషనర్‌ జాడ లేదు. ఆ తర్వాత భారీ వర్షాలతో కాలనీలు మునిగిపోతే బాధితులను ఆదుకోవడం.. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ చేయలేదన్నది గ్రేటర్‌ పరిధిలోని ప్రజాప్రతినిధుల ఆరోపణ. స్థానికంగా ఉన్న అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రభుత్వాన్ని కార్నర్‌ చేశాయి విపక్షాలు. తాజాగా సికింద్రాబాద్‌ రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన సమయంలోనూ స్పాట్‌కు వెళ్లలేదు కమిషనర్‌. దీంతో ఆయన తీరు మరోసారి చర్చగా మారింది.

సిటీ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటేనే కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ వస్తున్నారనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేల ఫోన్లకు స్పందిస్తే గొప్ప విషయంగా చెప్పుకొంటున్నాయి పార్టీలు. అయితే లోకేష్‌ కుమార్‌ విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన GHMC నుంచి కాలు బయటపెట్టాలంటే.. మున్సిపల్‌ శాఖలోని ఒక ఉన్నతాధికారి అనుమతి కావాలనే చర్చ సాగుతోంది. GHMC కమిషనర్‌గా లోకేష్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ సొంతంగా ఒక్క నిర్ణయం తీసుకోలేదని.. అంతా ఆ ఉన్నతాధికారే టేకప్‌ చేస్తారని సమాచారం. పైఆఫీసర్‌ ఆదేశిస్తే.. కమిషనర్‌ పాటిస్తారనే సైటైర్లు GHMCలో వినిపిస్తున్నాయి.

కమిషనర్‌ మీడియా ముందుకు రాకపోవడానికి కూడా మున్సిపల్‌ శాఖలోని ఆ ఉన్నతాధికారే కారణమట. ఇందులో వాస్తవం ఎంత ఉందో ఏమో.. లోకేష్‌ కుమార్‌ GHMC కమిషనర్‌గా వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఆ ప్రచారాన్ని బలపరిచేలా ఉన్నాయని గ్రేటర్‌ కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వానికి ఇబ్బందిగా భావించే కార్యక్రమాలకు వెళ్లొద్దనే ఆదేశాలు ఉన్నాయని.. అందుకే కమిషనర్‌ టచ్‌మీ నాట్‌గా మారిపోయారని మరికొందరు అనుమానిస్తున్నారు. మొత్తానికి గ్రేటర్‌ పరిధిలో కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ లొకేషన్‌ ఎక్కడో అని చెవులు కొరుకుడు ఎక్కువైంది.

 

Exit mobile version