ఆ నియోజకవర్గంలో వైసీపీకి వచ్చిన సమస్యేంటి?వచ్చే ఎన్నికల్లో గెలవాలనే టార్గెట్ గట్టిగానే ఉంది..కానీ, దానివైపు ప్రయత్నాలు ఎందుకు బలహీనంగా ఉన్నాయో స్థానిక నేతలకు కూడా అర్థంకాని పరిస్థితి.ఇన్ చార్జ్ కి స్థానిక నేతలకు ఏళ్ల తరబడి పొసగటం లేదు..ఇన్ చార్జ్ కి వ్యతిరేక వర్గం వాయిస్ కూడా పెంచుతోంది..
చివరకి పార్టీకి నష్టంగా మారుతున్నా, మూడేళ్లుగా పరిస్థితిలో మార్పు లేదనే టాక్ వినిపిస్తోంది.
బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి..అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్ కృష్ణచైతన్య …వైఎస్ వర్దంతి సందర్భంగా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన వ్యతిరేక వర్గం పోటీగా ఇంకోచోట అన్నదాన కార్యక్రమంతో పాటు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందట. అసమ్మతి వర్గ ఫ్లెక్సీలను ఇంచార్జ్ వర్గీయులు, మున్సిపల్ సిబ్బంది తొలగించటంతో అసమ్మతి నేతలు రాస్తారోకోకు దిగటం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత, బాచిన చెంచు గరటయ్య రాజకీయ వారసత్వంతో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు కృష్ణచైతన్య. గత ఎన్నికల్లో గరటయ్య వైసీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్ది గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడారు. వైసీపీ అధికారంలోకి రావటంతో గరటయ్య కుమారుడు కృష్ణచైతన్యను ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలతో పాటు, రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ భాద్యతలు అప్పగించింది. అయితే ఇంచార్జ్ గా భాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో పార్టీ కేడర్ మొత్తం ఆయనకు మద్దతుగా ఆయన వెంటే నడిచింది. క్రమంగా మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలు ఆయనతో టచ్ మీ నాట్ లా ఉంటూ వస్తున్నారట. అసమ్మతి నేతలందరూ కలసి జట్టుకట్టి మరీ వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో చైతన్యకు వ్యతిరేకంగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించటం పార్టీలో చర్చగా మారిందట.
కృష్ట చైతన్యకు తన తండ్రి హయాం నుండి రాజకీయం కొత్త కాకపోయినప్పటికీ ఓ నియోజకవర్గ ఇన్ చార్జ్ కి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులు లీడ్ తీసుకుని హడావుడి చేస్తుండటంతో, వారిని ఎలా డీల్ చేయాలో అర్దం కావటం లేదట. ఇంచార్జ్ కృష్ణచైతన్య ఏరికోరి పార్టీలోకి తీసుకువచ్చి, శింగరకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అప్పగించిన కోట శ్రీనివాసరావు కూడా అసమ్మతి నేతలతో కలసి కార్యక్రమాన్ని లీడ్ చేయటం చర్చగా మారింది.
కృష్ణచైతన్య నాయకత్వంలో పనిచేయలేమని, నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని రక్షించుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగామని అసమ్మతి నేతలు చెబుతున్నారట. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లేదని, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య వైసీపీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ఆందలం ఎక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారట. గతంలో వైఎస్‌ఆర్ జయంతి సందర్బంగా కూడా వారు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నా వారిని పిలిచి మాట్లాడటం కానీ.. కంట్రోల్ చేయక పోవటం వల్లే ఈ పరిస్దితి ఏర్పడిందని భావిస్తున్నారట..
నియోజకవర్గంలో రెండేళ్ల నుండి మిగిలిన నేతలతో దూరం పెరుగుతున్నా వారిని కృష్ణ చైతన్య సమన్వయం చేసుకోలేక పోతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం అద్దంకి నియోజకవర్గంపై దృష్టి సారించాలని అసమ్మతి నేతలు కోరుతున్నారట. పార్టీ ఇంచార్జికి, ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య సమన్వయం తీసుకురాకుంటే పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట.
2014లో వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవి గెలిచి టిడిపిలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన రవి మళ్లీ గెలిచారు. పార్టీ వీడిన రవిని ఎలాగైన ఓడించి అద్దంకిలో వైసీపీ జెండా ఎగురవేయాలనేది అధిష్టానం పట్టుదల. కానీ, స్థానికంగా ఉన్న వర్గాలు అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో పార్టీ శ్రేణులను ఆదోళనకు గురిచేస్తోంది. మరి అద్దంకి విషయంలో వైసీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
