NTV Telugu Site icon

TDP : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే విన్నపాలేంటి.? ఇంతలో మరో నాయకుడు కర్చీఫ్ వేస్తున్నారా.?

Yemmiganuru Pai Kotla Harsha

Yemmiganuru Pai Kotla Harsha

వారసుడిని చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారు అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. ఆ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇంతలో మరో నాయకుడు అక్కడ కర్చీఫ్‌ వేసేందుకు పావులు కదుపుతున్నారట. ఈ ఎత్తుగడల మధ్య అధికారపార్టీ రాజకీయాలపై చర్చ స్పీడందుకుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్‌ వాచ్‌..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అక్కడ పార్టీకి గట్టి పునాదులే వేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆ టీడీపీ కోటను దారుణంగా బద్దలు కొట్టేశారు. ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో బివి మోహన్ రెడ్డి తనయుడు జయనాగేశ్వర్ రెడ్డి తిరిగి టీడీపీ వశం చేసినా.. 2019లో మళ్లీ కేశవరెడ్డే సత్తా చాటారు. రాజకీయ నాయకుల్లో ఆయన తీరే వేరు. ఎదుటి వారు ఎంతటివారైనా మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ప్రస్తుతం ఆయన వయసు పైబడింది. ఆ కారణంతో 2024 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డికి టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఎమ్మిగనూరు వైసీపీ టికెట్‌పై నేతలు ఆశలు పెంచుకోవడానికి ఆస్కారం కల్పిస్తోంది.

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మిగనూరు టికెట్‌ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారట. వైసీపీ అధిష్ఠానం దగ్గర ఒక మాటేసి ఉంచినట్టు టాక్‌. అయితే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆయన ఎప్పటి నుంచో తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని అసెంబ్లీకి పంపాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే టికెట్‌ తనకు వద్దని కుమారుడిని బరిలోకి దించితే గెలిపిస్తానని చెప్పారట. కానీ.. వైసీపీ అధినేత జగన్‌ అంగీకరించలేదని.. దాంతో పెద్దాయనే బరిలో దిగారని చెబుతారు. ఈ దఫా మాత్రం కుమారుడి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట చెన్నకేశవరెడ్డి.

కోట్ల హర్ష ప్రస్తుతం కోడుమూరు వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అది ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గం. అక్కడ నుంచి పోటీ చేయడానికి వీలు లేదు. అందుకే ఎమ్మిగనూరుపై కన్నేశారట హర్ష. పైగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌తో ఆయనకు పడటం లేదు. మారిన ఆలోచనలతో ఎమ్మెల్యే సుధాకర్‌తో సఖ్యతగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారట. సమస్య ఏదొచ్చినా ఎమ్మెల్యే సుధాకర్‌తో సర్దుకుపోతున్నారట. ఇదంతా ఎమ్మిగనూరు టికెట్‌ను దృష్టిలో పెట్టుకునే అన్నది వైసీపీలో ఓపెన్‌ టాక్‌. టీడీపీ నేత కోట్ల సుర్య ప్రకాష్‌రెడ్డికి హర్ష సోదరుడు. వీరిద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్లకు ఇంఛార్జ్‌ ఉన్నారు హర్ష. ఆ నియోజకవర్గంతో రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయని వైసీపీ పెద్దలకు చెబుతున్నారట.

కుమారుడి కోసం ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ఒకవైపు.. ముందుగానే కర్చీఫ్‌ వేస్తే.. ఛాన్స్‌ తప్పకుండా వస్తుందని కోట్ల హర్ష మరోవైపు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ మొదలు పెట్టేశారు. దీంతో ఎమ్మిగనూరు వైసీపీ పంచాయితీ ఆసక్తిగా మారిపోతుంది. మరి.. వైసీపీ పెద్దలు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.