Site icon NTV Telugu

Vangalapudi Anitha : టీచర్ ఫ్యూచర్ ఏంటి ? అప్పుడు గంటా..ఇప్పుడు అయ్యన్న..?

Anitha

Anitha

Vangalapudi Anitha :అనుభవం నేర్పిన పాఠం.. ఆ మహిళా నేతలో మార్పులు తెచ్చిందా? అవసరమైతే 4 మెట్లు కాదు.. 40 మెట్లు దిగడానికైనా సిద్ధమని చెబుతున్నారా? ఇంత చేసినా నియోజకవర్గంపై పట్టు చిక్కుతుందా? మారుతున్న పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? ఇంతకీ ఎవరా మహిళా నేత? లెట్స్‌ వాచ్‌..!

వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే. టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. తక్కువ కాలంలోనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా ఎదిగారు. 2014లో తొలిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. ఆ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. ఎస్సీ రిజర్వ్డ్ స్ధానమే అయినప్పటికీ భిన్నమైన సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువ. ఆ కారణంగానే 2019లో అనితకు ఇక్కడ టికెట్‌ ఇవ్వలేదు టీడీపీ. ఎక్కడో దూరంగా ఉన్న కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత తిరిగి పాయకరావుపేటకు షిఫ్ట్‌ అయ్యారు అనిత.

తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటూ.. జిల్లా నాయకత్వంతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనిత. ఐతే, నియోజకవర్గం లేకపోతే పార్టీ యాక్టివీటీ తప్ప రెండో మాట ఎత్తడం లేదు. దీని వెనక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయనేది అంతర్గత చర్చ. అప్పట్లో గంటా శ్రీనివాస్‌ కోటరీలో అనిత ఉన్నారనే ప్రచారం జరిగేది. గంటాతో అయ్యన్న పాత్రుడికి ఉన్న గొడవల కారణంగానే అనితకు టికెట్‌ ఇవ్వలేదనే చర్చ సాగింది. ప్రస్తుతం గంటా రాజకీయంగా సైలెంట్‌ అయితే.. అయ్యన్న కీలకంగా ఉన్నారు. దాంతో అయ్యన్న టీమ్‌కు అనిత చేరువ అయినట్టు సమాచారం.

మళ్లీ గ్రూపులు, వాటి చుట్టూ తిరిగే రాజకీయాల్లోకి అడుగుపెడితే నష్ట తప్పదనే భయం అనితలో కనిపిస్తోందట. అందుకే జిల్లాలో వున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మినహా ఎక్కడా కనిపించడం లేదట. నియోజకవర్గంలో టీడీపీకి అండగా ఉన్న వారిని మెజారిటీ స్థాయిలో తనవైపు తిప్పుకొంటే…తప్ప అనితకు అవకాశాలు మెరుగుపడపు. ఈ దిశగా అవసరమైతే 40 అడుగులు వెనక్కి తగ్గడమే మేలని భావిస్తున్నారట. వీటి వెనక మరో కోణం ఉందట. ఇటీవల చంద్రబాబు జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. పాయకరావుపేటలో పార్టీ పరిస్ధితిపై చర్చ జరిగినప్పుడు అక్కడ నాయకత్వానికి, అనితకు ఒకే తరహాలో క్లాస్ పీకారట బాబు. విభేదాలు పక్కనబెట్టకపోతే తానే నిర్ణయం తీసుకుంటాని కాస్త కఠిన స్వరంతోనే హెచ్చరించారట.

టీడీపీ పొత్తులకు వెళితే ఇక్కడ జనసేన ఓటింగ్ కీలకంగా మారుతుంది. ఇప్పుడు ఎన్నికలను ఫేస్ చెయ్యాలంటే సొంతపార్టీని.. జనసేనలో ఉన్న నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోక తప్పదు. దీంతో ఇగోల కంటే గెలవడమే ముఖ్యమని భావిస్తున్న అనిత తాను పూర్తిగా మారిన మనిషినని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. మరి ఈ మార్పు అనితకు కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

Exit mobile version