మొక్కై వంగనిది మానై వంగుతుందా..? ప్రస్తుతం హిందూపురం వైసీపీలో పరిస్థితి అలాగే ఉంది. మూడేళ్ల క్రితం మొదలైన వర్గపోరు చినికి చినికి గాలి వాన కాదు.. పెద్ద తుఫానుగా మారిపోయింది. ఛాన్స్ దొరికితే చాలు కొట్టేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మహ్మద్ ఇక్బాల్.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనంటే నియోజకవర్గంలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏదో ఒక రూపంలో అసమ్మతి తెలియజేసినా.. ప్రస్తుతం మాత్రం ఆ సెగలు రోడ్డెక్కడంతో పరిస్థితి చేయ్యి దాటిపోతోంది. ఇందుకు తాజాగా హిందూపురంలో జరిగిన ఘర్షణే ఉదాహరణ.
హిందూపురం వైసీపీ సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం దొరకలేదు. ఇక్బాల్ పెత్తనం మాకొద్దు అనేలా తిరుగుబాటు తీవ్రమైంది. ఇక్బాల్‌తోపాటు ఆయన పీఏలు తమపై పెత్తనం చేస్తున్నారని.. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ.. తమకు ఎలాంటి పనులు కావడం లేదన్నది మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల వాదన. వీళ్లంతా కలిసి అసమ్మతి వర్గంగా ఏర్పడి స్వరం పెంచేస్తున్నారు. ఆ మధ్య బెంగళూరు సమీపంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు నాయకులు. తర్వాత హిందూపురానికి వేదిక మార్చారు. ఆపై తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా కంప్లయింట్ చేశారు అసమ్మతి నాయకులు.
హిందూపురంలో ప్రతిరోజు ఇక్బాల్‌పై మీడియాకు ఎక్కుతున్నారు పార్టీ నేతలు. ఎంపీపీ రత్నమ్మ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టగా.. ఇక్బాల్ వర్గీయులు అడ్డుకున్నారు. అడ్డుపడిన కౌన్సిలర్ ఇర్షాద్‌పై దాడి చేశారు కూడా. ఈ రణరంగానికి పోలీసులు ప్రేక్షకపాత్రగా ఉన్నారనేది అసమ్మతి వర్గం ఆరోపణ. అదే రోజు సాయంత్రం నేరుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మొన్నటి వరకు ఇక్బల్ తీరుపై పార్టీ నేత నవీన్ నిశ్చల్ ఒంటికాలిపై లేస్తే.. తాజాగా జరిగిన గొడవలో ఆయన ఊసే లేదు. నవీన్ లేకుండానే అసమ్మతి నేతలు రోడ్డెక్కడం ఒక ప్రశ్న అయితే.. వారిని నేరుగా ఇక్బాల్ సవాల్ చేయడం మరో ఎత్తు.
సమస్య క్యాంపులు.. ప్రత్యేక సమావేశాల వరకు వెళ్లినప్పుడే పార్టీ పెద్దలు పరిష్కరించి ఉంటే.. ఇవాళ ఘర్షణ పడే వరకు వచ్చేది కాదన్నది హిందూపురం వైసీపీ వర్గాల వాదన. ప్రస్తుతం వైసీపీ నేతలే వైరివర్గాలుగా మారిపోయాయి. ఎదురుపడితే ఘర్షణ తప్ప మాట్లాడుకొనే పరిస్థితి లేదు. సీమ పెతాపాలన్నీ వీరి మధ్యే కనిపిస్తున్నాయి. మరి.. జఠిలంగా మారిన హిందూపురం గాయాన్ని మాన్పేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
