NTV Telugu Site icon

Palamuru TRS : టీఆర్ఎస్ ఆశావాహులు అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నారా..?

Palamuru Trs Politics

Palamuru Trs Politics

టీఆర్‌ఎస్‌లోని ఆశావహులు అక్కడ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదే అని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? ఈ పోరు శ్రుతిమించి రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారుతోందా? కేడర్‌లోనూ గందరగోళానికి దారితీస్తోందా? లెట్స్‌ వాచ్‌..!

పాలమూరు జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ టీఆర్‌ఎస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌పై దాడి జిల్లాలో చర్చగా మారింది. కొన్ని రోజులుగా అలంపూర్‌లో ఎమ్మెల్యే అబ్రహంను విభేదించే పార్టీ కేడర్‌తో టచ్‌లో ఉన్నారట సాయిచంద్‌. సోషల్ మీడియా, వాట్సాప్‌ గ్రూప్ లు ఏర్పాటు చేసి అలంపూర్ భవిష్యత్ ఎమ్మెల్యే తానే అని సాయిచంద్‌ ప్రచారం చేసుకుంటున్నారట. సీఎంతోపాటు టీఆర్ఎస్‌ పెద్దలు అలంపూర్‌లో పనిచేసుకోమని చెప్పారని ఫీల్డ్‌లో తిరగడం.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం వర్గానికి రుచించడం లేదు. సాయిచంద్‌ పీఏ సైతం మండలస్థాయి నేతలకు ఫోన్‌ చేసి మద్దతివ్వాలని కోరడంతో సమస్య పీక్స్‌కు వెళ్లిందని టాక్‌. దీనికితోడు ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సాయిచంద్‌ ఏర్పాట్లు చేసుకోవడం ప్రత్యర్థి శిబిరానికి మంటెక్కించింది.

ఎమ్మెల్యే అబ్రహం వచ్చే ఎన్నికల్లో తన కూమారుడు అజయ్ ను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. పార్టీ పెద్దలకు కూడా ఆ విషయాన్ని తెలిపారట. ఇప్పటికే అలంపూర్‌లో అజయ్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అలంపూర్ టికెట్‌ను మాజీ ఎంపీ మందా జగన్నాథం, జడ్పీ మాజీ ఛైర్మన్‌ భాస్కర్‌ ఆశిస్తున్నారు. దీనికితోడు ఇంచార్జీ మంత్రిగా నిరంజన్‌రెడ్డి గ్రూప్ లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. గద్వాల జడ్పి చైర్మన్ సరితా తిరుపతయ్య దంపతులు ఎమ్మెల్యే వ్యతిరేకులకు మద్దతిస్తున్నారట. ఇప్పుడు సాయిచంద్ ఎంట్రీతో గ్రూపుల గోల పెరిగిపోయింది.

ఎమ్మెల్యే అబ్రహంను వయోభారంతో పక్కన పెడతారని ఆయన వ్యతిరేకులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సరిగ్గా సాయిచంద్ సైతం అలంపూర్‌లో సమైక్యతా ర్యాలీకి హజరు కావడం, తన వర్గీయులతో హడావిడి చేయడంతో ఎమ్మెల్యే శిబిరం ఫైర్‌ అయ్యింది. ఇదే జిల్లాకు చెందిన సాయిచంద్‌.. గతంలో నాగర్ కర్నూల్ ఎంపీ, జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ పదవులు ఆశించి భంగపడ్డారు. ఇంతలో నామినేటెడ్‌ పదవి ఇచ్చింది పార్టీ. ఆ హోదాలో అలంపూర్‌ టికెట్‌ సాధించి.. అక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు.

మొన్నటి వరకు ఆశావహులు.. ఎమ్మెల్యే శిబిరాల మధ్య విమర్శలు, సవాళ్లు నడిచేవి. ఇప్పుడు మాత్రం ఆధిపత్యపోరు రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారడంతో రేపటి రోజున ఏం జరుగుతుందో అనే సందేహాలు కేడర్‌లో ఉన్నాయట. మరి.. సమస్య ముదురుపాకాన పడకుండా పార్టీ పెద్దలు నేతల మధ్య సయోధ్య చేస్తారో లేక.. టికెట్‌ ఎవరికో క్లారిటీ ఇస్తారో చూడాలి.