Site icon NTV Telugu

Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్న చేరికలు |

Congress

Congress

అలిగిరి ప్రవీణ్‌రెడ్డి. హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్‌ రెడ్డి .. 2014లో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కండువా మార్చేశారు. గులాబీ గూటికి చేరుకున్నారు ప్రవీణ్‌రెడ్డి. అయితే రెండు దఫాలుగా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్‌ నుంచి వొడితల సతీష్‌ కుమార్‌ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. దీంతో అధికారపార్టీలో టికెట్‌ రాదనుకున్నారో లేక.. అక్కడ గుర్తింపు లేదని భావిస్తున్నారో కానీ.. కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ప్రవీణ్‌రెడ్డి. రాష్ట్రంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరు పెంచేందుకు ఫోకస్‌ పెట్టిన పీసీసీ.. ప్రవీణ్‌రెడ్డి రాకకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ రాజకీయాలు వేడెక్కాయి. ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోకముందే ఇక్కడి పార్టీ శ్రేణులు ఆయనంటే భగ్గుమన్నాయి.

హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్‌ అనే ఆశలతో పార్టీ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు కూడా. ఇప్పుడు ప్రవీణ్‌రెడ్డి రీఎంట్రీ ఇస్తే.. సీటు పంచాయితీ తప్పదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరామ్‌ వర్గం దూకుడు పెంచేసింది. పార్టీ నేతలు.. అనుచరులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు శ్రీరామ్‌. ప్రవీణ్‌రెడ్డి రాకపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తీర్మానం కూడా చేసేశారు. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు తెలియకుండా.. ప్రవీణ్‌రెడ్డిని ఎలా చేర్చుకుంటారని అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామ్‌గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. అసంతృప్తి వర్గం హుస్నాబాద్‌లో స్వరం పెంచేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకపోతే.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చేశారు. ఇంత జరుగుతున్నా ప్రవీణ్‌రెడ్డి మాత్రం పార్టీ మార్పుపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. రెండు రోజుల్లో అనుచరులతో మీటింగ్ పెట్టుకుని.. తన మనసులో మాట బయటపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉండటంతో.. పార్టీ మార్పుపై ఓపెన్‌గా చెప్పడమే మిగిలిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.

ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌లో వివిధ పార్టీల నుంచి నేతలు చేరుతుంటే.. అక్కడి నాయకులకు రుచించడం లేదు. అసంతృప్తి స్వరాలను గట్టిగానే వినిపిస్తున్నారు. వాటిని పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తర్వాత బుజ్జగిద్దామని అనుకుంటున్నారో ఏమో.. అసంతృప్తుల జాబితాలో నియోజకవర్గాల పేర్లు పెరిగిపోతున్నాయి. పార్టీలో చేరికల కమిటీ ఉన్నప్పటికీ.. ముందుగా వారికి చెప్పకపోవడం.. స్థానిక నేతలను ఒప్పించకపోవడం సమస్యగా మారుతోంది. మరి.. హుస్నాబాద్‌ రగడను పీసీసీ ఎలా చల్లారుస్తుందో చూడాలి.

 

Exit mobile version