Site icon NTV Telugu

టీడీపీ కోటను బద్దలుకొట్టే వ్యూహంలో వైసీపీ..!

వైసీపీ గాలిలోనూ ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అలాంటిచోట జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రెండూ భారీగా మోహరించాయి. కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ.. ఆ కోటను బద్దలు కొట్టి చరిత్ర రాయాలని వైసీపీ ఉవ్విళ్లూరుతున్నాయి. అది ఎక్కడో ఏంటో లెట్స్‌ వాచ్‌..!

ఆకివీడు పురపోరులో ప్రధాన పార్టీల హోరు..!

పంచాయతీకి ఎక్కువ.. టౌన్‌కు తక్కువ. ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పాలకొల్లుతోపాటు ఉండిలో టీడీపీ గెలిచింది. అప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని బలహీన పర్చి.. పూర్తిస్థాయిలో పాగా వేయడానికి వైసీపీ వేయని ఎత్తుగడ లేదు. ఇప్పుడు ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ పట్టు సాధించాలని చూస్తున్నాయి ప్రధాన పార్టీలు. వైసీపీ, టీడీపీలకు చెందిన కీలక నేతలంతా ఇప్పుడు ఆకివీడులోనే కనిపిస్తున్నారు. ఏ వార్డులో చూసినా ఎన్నికల కోలాహలమే.

అవగాహనతో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన..!

టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజు.. ఆకివీడులో మెజారిటీ వార్డులు చేజిక్కించుకుంటామని చెబుతున్నారు. మొత్తం 20 వార్డుల్లో 14 చోట్ల టీడీపీ.. ఆరుచోట్ల జనసేన పోటీ చేసేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. టీడీపీ నుంచి మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు ఆకివీడులోనే ఫోకస్‌ పెట్టారు. ఆర్థికంగా తట్టుకుని నిలబడితే తమ విజయానికి ఢోకా ఉండబోదని లెక్కలేస్తున్నారు టీడీపీ నాయకులు. టీడీపీ-జనసేన కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందనే అంచనాల్లో ఉన్నారు.

వైసీపీ నుంచి వార్డుకో ఎమ్మెల్యే.. నాలుగు వార్డులకో మంత్రి ఇంఛార్జులు..!

అధికార వైసీపీ అయితే అన్ని శక్తులను ఆకివీడులో మోహరించింది. వార్డుకు ఒక ఎమ్మెల్యే, నాలుగు వార్డులకు ఒక మంత్రిని ఇంఛార్జ్‌గా పెట్టి ప్రచారం చేస్తోంది.. రణతంత్రపు టెత్తులతో పోరును ఆసక్తిగా మలుస్తోంది. జిల్లా మంత్రులు ఆళ్ల నాని.. చెరుకువాడ శ్రీరంగనాథ రాజులు.. వైసీపీ జెండా ఎగరేసేందుకు గట్టిగానే వర్కవుట్‌ చేస్తున్నారు. ఉండి నియోజకవర్గానికే చెందిన పార్టీ ఇంఛార్జ్‌ గోకరాజు రాము, మాజీ ఎమ్మెల్యే, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, DCCB ఛైర్మన్‌ పీవీఎల్‌ నరసింహారాజుల త్రయం ఆకివీడును తమ గుప్పిట నుంచి జారిపోకుండా జాగ్రత్త పడుతోంది.

అసెంబ్లీ ఎన్నికను మించి ప్రచారం జోరు..!

ఎన్నిక జరిగేది ఆకివీడు నగర పంచాయతీకే అయినా.. టీడీపీ, వైసీపీల నుంచి కీలక నేతలు మోహరించడంతో అసెంబ్లీ ఎన్నికలను మించి పోతోంది ప్రచారం. మరి.. టీడీపీ తమ కంచుకోటను నిలబెట్టుకుంటుందో.. లేక అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి వైసీపీ ప్రతికారం తీర్చుకుంటుందో చూడాలి.

Exit mobile version