NTV Telugu Site icon

TCongress Incharge Post : కాంగ్రెస్ లో ఇంఛార్జ్ పదవి నుంచి శ్రీనివాస కృష్ణన్ ను తప్పించారా..తప్పుకున్నారా ?

Tcongress

Tcongress

TCongress Incharge Post:

ఆయన తెలంగాణలో పని చేయలేనని చెప్పేశారా..? ఎందుకొచ్చిన తలనొప్పి అని తప్పుకున్నారా..? గాంధీ కుటుంబానికి దగ్గరని ప్రచారం ఉన్నప్పటికీ ఆ నాయకుడి విషయంలో ఏం జరిగింది? ఎవరైనా పొమ్మనలేక పొగ పెట్టారా? తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చగా మారిన ఆ రగడేంటి? లెట్స్‌ వాచ్‌..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కోసం ఏఐసీసీ ముగ్గురు కార్యదర్శులను నియమించింది. వారిలో సలీం అహ్మద్‌ని ఏడాది క్రితం కర్నాటక రాజకీయాల్లో కీలకం చేశారు. మిగిలింది బోస్ రాజు, శ్రీనివాస కృష్ణన్. తాజాగా శ్రీనివాస కృషన్‌ని తెలంగాణ కార్యదర్శి బాధ్యతల నుండి తప్పించారు. ప్రస్తుతం ఆయనకు ఏ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేదు. శ్రీనివాస కృష్ణన్‌కి ప్రియాంక గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాయకుడిని తప్పించడం గాంధీభవన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

శ్రీనివాస కృష్ణన్‌ కాంగ్రెస్‌ నాయకుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయన లౌక్యం ప్రదర్శించేవారని టాక్‌. అయితే పని విషయంలో తెలంగాణలో మాత్రం ఇబ్బంది పడ్డారనే వాదన ఉంది. ఇక్కడ తలనొప్పులు చూశాకే ఇంకెక్కడా ఇంఛార్జ్‌గా వద్దని చెప్పి తప్పుకొన్నారని అభిప్రాయ పడుతున్నారు. కానీ.. ఇదే అంశంపై పార్టీ వర్గాల్లో మరో చర్చ ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, AICC కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస కృష్ణన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ నిబంధనలు.. నాయకుల మధ్య సయోధ్య విషయాల్లో ఠాగూర్‌కు, శ్రీనివాసన్‌కు మధ్య గ్యాప్‌ వచ్చిందట. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల మధ్య కొంత కాలంగా అంతర్గత పంచాయితీలు చాలానే ఉన్నాయి. వాటి విషయంలోనే ఇద్దరు AICC నాయకుల మధ్య దూరం పెరిగినట్టు టాక్‌. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా మంది ఇంఛార్జ్‌ ఠాగూర్‌ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఆయన చేయాల్సిన పనులను మరో AICC కార్యదర్శి బోసు రాజుకు అప్పగించారు. ఆ పనుల్లో అప్పుడప్పుడూ శ్రీనివాసన్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఇది మంచిది కాదనే అభిప్రాయం శ్రీనివాసన్‌కు ఉండేదట.

తెలంగాణ కాంగ్రెస్‌లో వ్యవహారాలు.. సమస్యలను ఇంఛార్జ్‌ ఠాగూర్‌ జోక్యం చేసుకోకపోవడంతో AICC కార్యదర్శులే డీల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్యదర్శులు బద్నాం అవుతున్నారనే ఫీలింగ్‌ చాలా మంది నాయకుల్లో ఉందట. అందుకే ఠాగూర్‌ వైఖరితో శ్రీనివాసన్‌ విసిగిపోయినట్టు చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన రాష్ట్ర ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస కృష్ణన్‌ది కేరళ. ఆ రాష్ట్ర బాధ్యతలు ఆయనకే అప్పగించాలని పార్టీ పెద్దలు చూశారట. దానికి ఆయన ఒప్పుకోలేదట. ప్రస్తుతం AICC కార్యదర్శిగా ఉన్నా.. ఇంకే రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వెళ్లలేదు. AICC కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. ఠాగూర్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్న జాబితాలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస కృష్ణన్‌ కూడా తెలంగాణకు వచ్చి.. బాధితుల జాబితాలో చేరినట్టు పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారట.