Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!

  • వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌ నేతల రహస్య సమావేశాలు..
  • తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు..
  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై అసంతృప్త నేతల రుసరుసలు
Vikarabad

Vikarabad

ఆ నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్‌ నేతల రహస్య సమావేశానికి కారణం ఏంటి?అధికార పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారా?అసంతృప్తులు అందరూ ఒక్కటవుతున్నారా? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది?

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కొందరు నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు పలుమార్లు సమావేశాలు నిర్వహించారని ప్రచారం నడుస్తోంది. బషీరాబాద్ మండల కాంగ్రెస్‌లోనూ అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయట. దీంతో తాండూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుందనే టాక్‌ నడుస్తోంది. బషీరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్‌ రెడ్డితో పాటు పలువురు అసంతృప్త సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలుస్తోంది.

ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వ్యవహార శైలిపై కొందరు నేతలు మహేందర్‌ రెడ్డి ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాల్లో సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని, కాంగ్రెస్ కోసం మొదటి నుంచి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మండలంలో పార్టీ బలహీనపడుతుందని సీనియర్ నేతలు సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మండలంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం అవసరమని మహేందర్‌ రెడ్డి పార్టీ శ్రేణులతో తన అభిప్రాయ వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మహేందర్ రెడ్డి అసంతృప్త నేతలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడొద్దని పట్నం భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాండూరులో తన కుటుంబమే పోటీలో ఉంటుందని మహేందర్‌ రెడ్డి సంకేతాలు ఇచ్చినట్లుగా జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టాక్‌. బషీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భేటీ కావటం జిల్లా రాజకీయాల్లో దుమారం రేపింది.

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఒకరిద్దరికే ప్రాధాన్యతనిస్తూ, మిగిలిన నాయకులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి…ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒంటెత్తు పోకడలు పోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ముందు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కల్పించుకొని అందరికీ అండగా ఉంటానని, జరిగిన విషయాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు సర్ది చెప్పినట్లు సమాచారం. మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందా? లేదా అనేది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.