Site icon NTV Telugu

భద్రాచలం కాంగ్రెస్‌లో వీరయ్యకు లొంగని వర్గపోరు !

పార్టీ అధికారంలో లేకపోయినా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య వర్గపోరు మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. కేడర్‌కు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట అక్కడ ఎమ్మెల్యే. ఊరిలో పల్లకీ మోత.. ఇంట్లో ఈగల మోతగా మారి ఇబ్బంది పడుతున్నారట. చివరకు ఇంటిపోరు భరించలేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు?

ఎమ్మెల్యే వీరయ్య చెప్పినా వినని పార్టీ కేడర్‌

పొదెం వీరయ్య. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన పీసీసీలో ఉపాధ్యక్షుడు. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చిక్కకుండా.. హస్తంపార్టీలోనే నమ్మకంగా ఉండటంతో ప్రమోషన్‌ ఇచ్చింది కాంగ్రెస్‌. విపక్ష పార్టీ ఎమ్మెల్యే.. పార్టీ కేడర్‌ అంతా ఆయన చెప్పినట్టే వింటుందని భావిస్తే పొరపాటే. భద్రాచలం కాంగ్రెస్‌లో వర్గపోరు వీరయ్యకే అంతుచిక్కడం లేదట. ఎమ్మెల్యే ఎంత నచ్చజెప్పినా ఎవరికివారే యమునా తీరే అంటున్నారట పార్టీ నాయకులు.

read also : ఏపీ కరోనా అప్డేట్..కొత్తగా 3841 కేసులు..

ఉన్న కొద్దిమంది కాంగ్రెస్‌ నేతలదీ తలోదారి!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు 4 అసెంబ్లీ సీట్లు దక్కాయి. వాటిలో భద్రాచలం ఒకటి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై ఇక్కడ పైచెయ్యి సాధించినా.. కాంగ్రెస్‌ నేతలను కట్టడి చేయలేకపోతున్నారు ఎమ్మెల్యే వీరయ్య. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారెక్కేయడంతో ఈ ప్రాంతంలో కొద్దిమందే నాయకులే ప్రముఖంగా మిగిలారు. వారు కూడా తలోదారి అన్నట్టు ఉంటున్నారట. భద్రాచలం.. మణుగూరుల్లో ఎమ్మెల్యే కార్యక్రమాల స్పీడ్‌ పెంచినా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా కేడర్‌లో మాత్రం ఐక్యత కనిపించడం లేదట.

భద్రాచలం కాంగ్రెస్‌లో లుకలుకలు

వీరయ్యది భద్రాచలం కాదు. వరంగల్‌ జిల్లా ములుగు ప్రాంతం. అప్పట్లో అక్కడ కాంగ్రెస్‌కు నాయకులు లేకపోతే వలస వచ్చారు. 2018 ఎన్నికల్లో కాలం కలిసొచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై కొత్త ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆయనకు కొత్త పదవులు వచ్చినా భద్రాచలం కాంగ్రస్‌లోని లుకలుకలను మాత్రం సరిచేయలేకపోతున్నారట. భద్రాచలంలో కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరి కుంపటి వారిదే.

కేడర్‌ మాట వినకపోవడంతో విసుగెత్తిపోయిన ఎమ్మెల్యే వీరయ్య

వీరయ్యకు పీసీసీ ఉపాధ్యక్ష పదవి రావడంపట్ల భద్రాచలం కాంగ్రెస్‌లోని రెండు శిబిరాలు సంతోషించాయి. కానీ సంబరాలను వేర్వేరుగా నిర్వహించాయి. వర్గపోరు భరించలేక స్థానిక నేత నక్కా ప్రసాద్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అలాగే పార్టీ ఆఫీసు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న దుకాణాల అద్దె విషయంలోనూ రెండు వర్గాలు రోడ్డుక్కుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడిగా నేరెళ్ల నరేష్‌ను ప్రకటించారు. ఇది రుచించని మరోవర్గం సలహా కమిటీ పేరుతో వేరే టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా కేడర్‌ మాట వినకపోవడంతో.. ఎమ్మెల్యే విసుగెత్తిపోయారట. భద్రాచలం రాకుండా.. హైదరాబాద్‌, ములుగులోనే ఉండిపోతున్నారట. దాంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు ఊర్లో పల్లకీ మోత.. ఇంట్లో ఈగల మోతగా తయారైందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Exit mobile version