Site icon NTV Telugu

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ..!

ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. కాకుంటే కాస్త డిఫరెంట్‌. పార్టీలో ఉంటారు.. అప్పుడప్పుడూ పార్టీకి గిట్టని పనులు కూడా చేస్తుంటారు. మరోసారి టికెట్‌ రాదని అనుమానం వచ్చిందో ఏమో .. ముందే జాగ్రత్త పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అందుకు సంకేతాలుగా చెబుతున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే కొత్తదారిలో ప్రయాణిస్తారా?

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలోనే అసంతృప్తి ఉందా?

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. వరసగా రెండోసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నది అధికారపార్టీ వర్గాల టాక్‌. అప్పట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కోటంరెడ్డిని పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ..ఆ పార్టీ నేతలతో సంబంధాలు బలపర్చుకున్నారట. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక అన్ని విషయాల్లోనూ పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కొనాసాగిస్తున్నారనే విమర్శ ఉంది. తన అనుచరుడు చెప్పినట్టు చేయలేదనే కారణంతో వెంకటాచలం MPDO ఇంటికి వెళ్లి భయపెట్టారని పోలీసులు కేసుపెట్టారు. నెల్లూరు శివారుల్లో వెలుగు చూస్తున్న భూ వివాదాల్లోనూ కోటంరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన వ్యవహార శైలిపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలతో కూడా కోటంరెడ్డికి సత్సంబంధాలు లేవని చెబుతారు.

పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు పలకరింపులు..!

ఇటీవల కాలంలో శ్రీధర్‌రెడ్డి తీరు పలు అనుమానాలకు తావిస్తోందట. టీడీపీ, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారట. అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్ర నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోకి రాగానే వెళ్లి వాళ్లను పలకరించారు శ్రీధర్‌రెడ్డి. వారితో కలుపుగోలుగా ఉండటం పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ చర్యపై విమర్శలు రావడంతో.. మానవతా దృక్పథంతోనే రైతులను కలిసి మాట్లాడానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నారు. దానిమీద ప్రెస్‌మీట్‌ పెట్టాలని హైకమాండ్‌ చెప్పినా కోటంరెడ్డి వినలేదట. ఏదో మొక్కుబడిగా వివరణలా చెప్పేసి మమ అనిపించారట. జిల్లాలో ఏ వైసీపీ ఎమ్మెల్యే కూడా రైతుల పాదయాత్రను పట్టించుకోనిది కోటంరెడ్డి ఒక్కరే అలా ఎందుకు చేశారనేచర్చ పార్టీలో జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డికి టికెట్‌ రాదని పార్టీ వర్గాల్లో ప్రచారం..!

వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పాల్గొన్న సభల్లో శ్రీధర్‌రెడ్డి .. రాజకీయాల్లో వెంకయ్య తనకు ఆదర్శమని ప్రకటించారు. అలాగే వైసీపీ సభలకు వస్తే తనకు వైఎస్‌ఆర్‌ ఆదర్శమని చెప్పేవారు. ఇవన్నీ ఇప్పుడు చర్చల్లోకి తీసుకొస్తున్నారట వైసీపీ నేతలు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డికి వైసీపీ టికెట్‌ రాదని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీ అంతర్గత నివేదికలు కూడా శ్రీధర్‌రెడ్డి పనితీరుకు వ్యతిరేకంగా సీఎం జగన్‌కు రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. జిల్లా నేతలు కోటంరెడ్డి వ్యవహారాలను కథలు కథలుగా చెప్పుకోవడం బహిరంగ రహస్యమే. అన్ని వ్యవహారాలను సోదరుడితో నడిపించేస్తున్నారట. ఒకటి రెండుసార్లు పార్టీ నాయకత్వం శ్రీధర్‌రెడ్డిని సున్నితంగా హెచ్చరించిందట. పద్ధతి మార్చుకోవాలని చెప్పారట. అయినా సేమ్‌ సీన్‌ అట. కొరకరాని కొయ్యగా మారిన శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్టు జిల్లా నేతలు చెప్పుకొంటున్నారు. ఎమ్మెల్యే కూడా దాన్ని గమనించినట్టున్నారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే అమరావతి రైతులను పలకరించారా?

అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ రాకపోతే టీడీపీ లేదా బీజేపీ నుంచి బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే దారులు వెతుక్కుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ముందు జాగ్రత్తల్లో భాగంగానే టీడీపీ నేతల మద్దతు సంపూర్ణంగా ఉన్న అమరావతి రైతుల పాదయాత్ర శిబిరంలో ప్రత్యక్షం అయ్యారని.. ఎక్కడా లేని ఆప్యాయత చూపారని కోటంరెడ్డిపై చర్చ జోరందుకుంది. పైగా ఇటీవల కాలంలో టీడీపీ నేతలపై ఎలాంటి విమర్శలు చేయడం లేదట ఈ వైసీపీ ఎమ్మెల్యే. ఆ అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరి.. కోటంరెడ్డి వచ్చే ఎన్నికలనాటికి కొత్తబాట వేసుకుంటారో.. లేక పార్టీనే కొత్త వారిని చూసుకుంటుందో చూడాలి.

Exit mobile version