ఆ అధికారి రూల్ ప్రకారం వెళ్లారు. అది అధికారపార్టీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. పైగా తన పుట్టలోనే వేలు పెట్టడంతో రాత్రికి రాత్రే ఆ ఆఫీసర్‌ను బదిలీ చేయించేశారట. పైగా ఇదంతా లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం విశేషం. దానిపైనే ఇప్పుడు టీఆర్‌ఎస్‌తోపాటు.. అధికారుల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు
వికారాబాద్ జిల్లలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారిపై సడెన్‌గా బదిలీవేటు పడటం టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వికారాబాద్ మండలం గోధుమగూడ శివారు సర్పన్‌పల్లి చెరువు దగ్గర సర్వే నెంబర్ 97లోని 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అక్కడి నిర్మాణాలను కూల్చేసిన తహశీల్దార్ రవీందర్‌ను బదిలీ చేసేశారు. ఈ ట్రాన్స్‌ఫర్ వెనక జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టిన ఐదు రోజుల్లోనే ట్రాన్స్‌ఫర్ కావడంతో ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి 18 ఎకరాల ప్రభుత్వ భూమిలోని ప్రైవేట్ కట్టడాలపై తహశీల్దార్ ఫోకస్ పెట్టినప్పుడే ఆయనపై ఒత్తిళ్లు వచ్చాయట. కానీ. తహశీల్దార్ ఆ ఒత్తిళ్లను లెక్క చేయలేదట. దీంతో రవీందర్‌ను వికారాబాద్ నుంచి కొడంగల్‌కు పంపేశారు.
యజమానికి తెలియకుండానే 7.12 ఎకరాలు ప్రైవేట్ పరం!
తహశీల్దార్ ఆఫీస్‌లో ఇంటి దొంగలపై పోలీసులకు ఫిర్యాదు
ఆ మధ్య వికారాబాద్ మండలం బూర్గుపల్లిలో 7.12 ఎకరాల విలువైన భూమిని యజమానికి తెలియకుండా తహశీల్దార్ ఆఫీస్‌లోని కంప్యూటర్ ఆపరేటర్లు మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఆ భూమి కొని మోసపోయిన వ్యక్తి కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ అంశంపై తహశీల్దార్ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయట. మూడున్నర కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి రియాల్టర్లు స్కెచ్ వేస్తే.. వారికి వెనక ఉన్నది ఎవరు.. ఎవరి అండ చూసుకుని కంప్యూటర్ ఆపరేటర్లు రిజిస్ట్రేషన్ చేశారు అన్నది ప్రశ్నగా ఉంది. ఇంటి దొంగలు ఆఫీస్‌లోనే ఉన్నారని గుర్తించిన తహశీల్దార్ రవీందర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్‌కు తెలియకుండా ఆయన తంబ్‌ను వాడిన సిబ్బందిపై కేసు నమోదైంది. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు 18 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదంలో ఏకంగా తహశీల్దార్ బదిలీ అయ్యారు.
ఒత్తిళ్లు వచ్చినా నిర్మాణాలు కూల్చేసిన తహశీల్దార్
లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండానే బదిలీ చేయించిన మరో ఎమ్మెల్యే!
ప్రభుత్వానికి చెందిన 18 ఎకరాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు రిసార్ట్ కట్టాలని పనులు మొదలుపెట్టారు. అధికారపార్టీ శాసనసభ్యుడు కావడంతో తనకు ఎదురే ఉండదని భావించారో ఏమో..పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టేశారు. రిసార్ట్ గురించి తెలుసుకున్న తహశీల్దార్.. ఎవరైతే నాకేంటి అని చర్యలు చేపట్టారు. ఇది ఎమ్మెల్యే అహాన్ని దెబ్బతీసిందట. తాను చెప్పినా వినలేదని ఆగ్రహంచిన ఆయన హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తెచ్చి తహశీల్దార్‌ను బదిలీ చేయించారని ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే.. తహశీల్దార్ పనిచేస్తున్న ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవేమీ తెలియవట. ఆ ఎమ్మెల్యేకు తెలియకుండానే కథంతా నడిపించేశారట అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే. ఈ అంశమే ఇప్పుడు రాజకీయ, రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే పవర్ ముందు.. అధికారి పవర్ వీకైందనే టాక్ మొదలైంది.
