ఐదారేళ్ల గ్యాప్ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం దేనికి సంకేతం? జిల్లాల్లో ఎవరికైనా కత్తెర పడబోతుందా? నిన్నమొన్నటి వరకూ తామే సుప్రీం అనుకున్నవారికి చెక్ పడినట్టేనా? గులాబీ పెద్దల ఆలోచనలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? అధికారపార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్!
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి నిర్ణయం!
టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోనుండటమే దీనికి కారణం. గతంలో టీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయిలో సమన్వయకర్తలు ఉండేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. సమన్వయకర్తల ఊసే లేదు. ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు సుప్రీం అని తేల్చేశారు. దీంతో వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనం అన్నట్టు ఇన్నాళ్లూ సాగుతూ వస్తోంది. అప్పట్లోనే టీఆర్ఎస్‌కు జిల్లా అధ్యక్షులను, కమిటీలను ఏర్పాటు చేయాలని చర్చ జరిగినా.. ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఆ అంశాన్ని పక్కన పడేశారు. తాజాగా జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే సుప్రీంలుగా ఉన్నారు!
నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని చెప్పిన తర్వాత టీఆర్ఎస్‌కు జిల్లా సమన్వయ కర్తలు లేదా జిల్లా అధ్యక్షులను నియమిస్తే సమాంతర నాయకత్వంతో లేనిపోని సమస్యలు వస్తాయని అనుకున్నారు గులాబీ పెద్దలు. నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను కూడా ఎమ్మెల్యేలు లేదా ఇంచార్జ్‌లే చూసుకునేవారు. కానీ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే టీఆర్ఎస్‌కు జిల్లా అధ్యక్షులు ఉండాలనే చర్చ సాగింది. కొత్త జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుల నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. గులాబీ దళపతి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులను పార్టీనే నామినేట్ చేస్తుందని సమాచారం.
ఎమ్మెల్యేలకు కత్తెర పడినట్టేనా?
ఐదారేళ్ల గ్యాప్ తర్వాత జిల్లా అధ్యక్షుల రాక?
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి సారథ్యంలో ఇతర పార్టీ కమిటీల ఏర్పాటు ఉంటుందని సమాచారం. జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు కూడా కమిటీ సారథ్యంలోనే నిర్వహిస్తారు. పార్టీ.. ప్రభుత్వ కార్యక్రమాల పరంగా ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అన్నీ చూసుకునేవారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడి పర్యవేక్షణలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే.. ఎమ్మెల్యేలకు కత్తెర పడినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. క్షేత్రస్థాయిలోని అంశాలను కేవలం ఎమ్మెల్యేలకే అప్పగించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు.. ప్రత్యేకంగా ఒకరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉండటంతో ఐదారేళ్ల గ్యాప్ తర్వాత కమిటీలు తెరపైకి వస్తున్నాయని అనుకుంటున్నారు.
పదవుల పంపకాల్లో అధ్యక్షుల నుంచి ఫీడ్ బ్యాక్?
క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి.. సరైన ఫీడ్ బ్యాక్ పొందడానికి జిల్లా అధ్యక్షులు, పార్టీ కమిటీ ఉపయోగకరంగా ఉంటుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. పదవుల పంపకంలో కూడా జిల్లా అధ్యక్షుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. ఎమ్మెల్యేలు నివేదికలు ఇచ్చినా.. పైస్థాయిలో వడపోతలకు మరింత వెసులుబాటు దొరుకుతుందని టాక్. మరి.. కొత్త నిర్ణయం గులాబీ శిబిరానికి ఎలాంటి ఉత్సాహాన్ని తీసుకొస్తుందో చూడాలి.
