NTV Telugu Site icon

టీపీసీసీ చీఫ్ వ్యతిరేక శిబిరం నుంచి ఆరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి డిమాండ్

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం నాయకులు ఎక్కువైతే.. పదవులు పెరుగుతాయి. ఉన్నవాళ్లకు పని లేకపోయినా.. పదవుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం ఆ పార్టీ స్పెషల్‌. ఇప్పుడు ఓ పదవికి ఇంకా డిమాండ్‌ పెరిగింది. అలకపాన్పు ఎక్కిన నేతలు సైతం ఆ పోస్టే అడుగుతున్నారట. ఇంతకీ ఆ పదవికి ఉన్న క్రేజ్‌ ఏంటి?

అలకలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు… ఆ పదవే కోరుతున్నారా?

తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించినప్పుడు మొదలైన నేతల అలకలు ఇంకా కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ నియామకంపై.. పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొద్దిమంది గళం విప్పారు కూడా. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ని కడిగి పారేశారు. ఇటేమో.. అందరి గడపా తొక్కి కలిసి పనిచేద్దామని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ వ్యతిరేక శిబిరంలో ఉన్న నాయకులు మాత్రం.. అధిష్ఠానానికి కొత్త డిమాండ్‌లు పెడుతున్నారు. అలక వీడాలి అంటే.. ఆ పదవి ఇవ్వండి అనే రీతిలో డిమాండ్‌లు పెరిగిపోతూ ఉన్నాయి. డిమాండ్ ఉన్న ఆ పదవి పైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిపై నేతల కన్ను!

అలకలో ఉన్న నేతలు మనసు పడుతున్న పదవి.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. దాంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకే ఒక్క వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి ఇప్పుడు ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ వచ్చారు. పార్టీ పరిస్థితి బాగా లేనప్పుడు నాయకత్వాన్ని గ్రిప్‌లో పెట్టుకోవడం నేతలకు అలవాటే. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో సామాజిక సమీకరణ కోసం వర్కింగ్ ప్రెసిడెంట్స్ సంఖ్య పెంచారు. ఇప్పుడు పీసీసీ నియామకం తర్వాత కూడా అలాంటి డిమాండ్ వస్తుంది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ పదవిపై కన్నేశారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అదే కోరుతున్నారా?

రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల రేవంత్‌తోపాటు పార్టీ నాయకులు కొందరు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. అయితే పార్టీ నాయకులు.. ఇంఛార్జ్‌కి తన డిమాండ్ వినిపించారట ప్రేమ్‌ సాగర్‌రావు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. తన సామాజికవర్గాన్ని పార్టీ దగ్గర చేసుకోవడానికి ఆ పదవి అక్కరకు వస్తుందనేది ప్రేమ్‌ సాగర్‌రావు వాదన.

ప్రస్తుతం టీ పీసీసీలో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌

ప్రస్తుతం ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ను నియమించి నెలరోజులు గడిచింది. పని విభజన జరగలేదు. శనివారం జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో హాజరు వేయించుకోవడం తప్ప మరో వర్క్‌ లేదు. ఇదే సమయంలో ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ తెరమీదకు వస్తోంది. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఇంకో పోస్ట్‌ పెంచుతారా? లేదంటే ఇంకేదైనా పదవి ఇచ్చి ఆయన్ని బుజ్జగిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇంఛార్జ్‌ స్థాయిలో మాట్లాడితే ప్రేమ్‌ సాగర్‌రావు మనసు మార్చుకుంటారేమో అన్న ఆశ కూడా పార్టీ వర్గాల్లో ఉందట.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి డిమాండ్ పెరిగిందా?

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవికి డిమాండ్‌ పెరిగిందన్నది గాంధీభవన్‌ వర్గాల్లో వినిపించే మాట. ఒకప్పుడు పార్టీలో వెయిట్‌ ఉన్న పదవిని.. ఇలా అందరికీ పంచి పల్చన చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా ఉంది. మరి.. నేతలు అలక వీడేందుకు కాంగ్రెస్‌ ఏ మంత్రం వేస్తుందో చూడాలి.