ఆ చారిత్రక నగరంలో కోఆర్డినేటర్లను మార్చినా అధికార వైసీపీ దశ మారడం లేదు. ఇప్పటికే ఇద్దరు కోఆర్డినేటర్లను మార్చి మూడో నేతకు పగ్గాలు అప్పగిస్తే ఆయనా మూతి ముడుచుకుని కూర్చున్నారటా. ప్రభుత్వ పథకాలు.. నామినేటెడ్ పదవులతో రాష్ట్రంలో అన్నిచోట్ల వైసీపీ జోష్‌లో ఉంటే అక్కడ పార్టీ కార్యాలయం వెలవెలబోతుందట. ఇంతకీ ఏంటా నగరం? అక్కడ వైసీపీకి ఏమైంది? లెట్స్ వాచ్!
నేతలు ఎక్కువ.. సమన్వయం తక్కువ!
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు రాష్ట్రంలో అధికార వైసీపీకి రాజమండ్రిలో కోఆర్డినేటర్ ఉన్నా దిక్కులేనిదిగా అయిపోయింది. ఆఫీసు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. కానీ లోపల ఎవరూ ఉండరు. గడిచిన ఎన్నికల్లో రాజమండ్రి, రాజమండ్రి రూరల్లో వైసీపీ ఓడిపోయింది. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజమండ్రి టౌన్‌లో పార్టీ దశ మారడం లేదు. కొద్దినెలల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ నేతల్లో ఐక్యత లేదు. పైగా ఇక్కడ నేతలు ఎక్కువ. వారి మధ్య సమన్వయం తక్కువ. పైకి ఐక్యంగా ఉన్నట్టు కనిపించినా.. ఎవరి ఎత్తుగడలు వారివే.
మొదట్లో ఉత్సాహంగా పనిచేసిన ఆకుల
ఇంటా బయటా విమర్శలతో అలక బూనిన ఆకుల
ఎన్నికల తర్వాత ఇద్దరు కోఆర్డినేటర్లను మార్చి కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది. సిటీ కోఆర్డినేటర్‌గా మొదట ఉత్సాహంగా పనిచేసి ఇప్పుడు ఆయనా ముఖం చాటేస్తున్నారు. నోటి దురుసు.. వివాదాస్పద వ్యాఖ్యలతో కొందరికి దూరం.. మరి కొందరికి దగ్గర అయ్యారు. అలాంటిది ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నేతలుగా ప్రజల్లో ఎలా ఉండాలనే విషయాలను చెప్పడానికి కాబోలు.. పార్టీ కార్యకర్తల కట్టుబొట్లు గురించి ఆకుల చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పేద కాపుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన సంస్థ విషయంలోనూ ఆకులను పార్టీలో కొందరు తప్పుపట్టినట్టు సమాచారం. తాను ఏదో చేద్దాం అనుకుంటే అందరూ తననే తప్పుపడుతుండటంతో హర్ట్ అయ్యారట ఆకుల. పార్టీలోనూ.. బయటా విమర్శలు పెరగడంతో అలకబూనారట. బిజినెస్‌పై దృష్టి పెట్టినట్టి తరచూ దూర ప్రయాణాలు చేయడంతో ఆయన అందుబాటులో ఉండటంలేదు. ఊళ్లో ఉన్నా కూడా పార్టీ కార్యక్రమాలు ఏమీ నిర్వహించట్లేదు.
అవకాశం కోసం ఎదురు చూస్తోన్న ఆకుల ప్రత్యర్థులు!
ఎంపీతో కలిసి పనిచేస్తున్న రౌతు సూర్యప్రకాష్!
వైసీపీ సిటీ కార్యాలయానికి ఆకుల నెల నెలా వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు. కానీ ఆఫీసుకు రావట్లేదు. ఒకరో ఇద్దరో కార్యకర్తలు ఆఫీసు తెరిచి ఉంటున్నారు. నాయకుడే లేకపోవడంతో ఎవరూ రావడం లేదట. మొదట్లో చాలా చురుగ్గా వ్యవహరించిన ఆకుల సత్యనారాయణ ఎందువల్ల కార్యక్రమాలు నిర్వహించట్లేదో పార్టీవర్గాల్లో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఆకుల ప్రత్యర్ధులు మాత్రం అవకాశం కోసం వేచి చూస్తున్నారట. కానీ పార్టీలో ఆకులకు నేరుగా శత్రువులెవరూ లేరు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇద్దరు ఆయనకు సహకరిస్తున్నారట. ఆకుల కంటే ముందు సిటీ కోఆర్డినేటర్‌గా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావు ఎంపీ భరత్‌తో కలిసి పనిచేస్తున్నారు.
మూడోసారి పార్టీ కోఆర్డినేటర్‌ను మారుస్తారా?
గత ఎన్నికల్లో ఓడిన నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెడతారనే ప్రచారంతో వేచి చూస్తున్నారు. మరో కోఆర్డినేటర్‌గా చేసిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం పార్టీలోనే ఉన్నప్పటికీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎవరితోనూ కలవట్లేదు. ఇద్దరు కోఆర్డినేటర్లను మార్పు చేసి మూడో కోఆర్డినేటర్‌గా ఆకుల వచ్చినా పార్టీ పరిస్థితి ఏమీ మారలేదట. దీంతో మరోసారి కోఆర్డినేటర్‌ను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావును స్మార్ట్ సిటీ చైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో ఆయన యాక్టివ్‌గా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎంపీ భరత్ సొంతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలో సిటీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ఇప్పుడు రాజమండ్రి వైపు కన్నెత్తి కూడా చూడటంలేదట. మరి.. పార్టీ నేతలను గాడిలో పెట్టేందుకు వైసీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
