NTV Telugu Site icon

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి దండోరా రగడ…!

ఇంద్రవెల్లి అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. అమరుల త్యాగాలకు చిహ్నం. ఆ ప్రేరణతోనే ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన దండోరా మోగించాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. పార్టీ ప్లాన్‌ బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమం కాంగ్రెస్‌లోనే దండోరా మోగిస్తోందట. నేతల మధ్య గ్యాప్.. అలకలు.. రుసరుసలు.. బుజ్జగింపులు.. ఒక్కటేమిటి.. కొత్త పంచాయితీ రంజుగానే ఉందట.

ఇంద్రవెల్లిలో కాదు.. కాంగ్రెస్‌ నాయకుల మధ్య దండోరా!

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పేరుతో ఆ వర్గాలకు మరింత చేరువ కావాలని నిర్ణయించింది. అందుకు చకచకా పావులు కదుపుతోంది కూడా. ఈ కార్యక్రమానికి కౌంటర్ అటాక్ మొదలుపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారనే నినాదంతో ఇంద్రవెల్లి నుంచి దళిత గిరిజన దండోరా మోగించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి వెళ్లిన సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ దండోరాపై ప్రకటన చేశారు. సర్కార్ మీద దండోరా ఇంద్రవెల్లి నుంచే మొదలు పెడతామని ఆయన ప్రకటించారు. కానీ.. ఇంద్రవెల్లిలో మోగాల్సిన దండోరా ముందుగానే కాంగ్రెస్‌ నాయకుల మధ్య మోగుతోందట.

రేవంత్‌రెడ్డి ప్రకటనపై మహేశ్వర్‌రెడ్డి గుర్రు!
పీసీసీ నిర్ణయాలపై మహేశ్వర్‌రెడ్డి అసంతృప్తి!

ఇంద్రవెల్లిలో దండోరాపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి వెళ్లి ఎలా ప్రకటిస్తారని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారట. కొత్తగా ప్రకటించిన పీసీసీలో మహేశ్వర్‌రెడ్డికి AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. పీసీసీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో ఆయన సభ్యుడు కూడా. PACలో దళిత దండోరా యాత్ర చేయాలని చర్చించారట. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నది చర్చకు రాలేదట. అందుకే మహేశ్వర్‌రెడ్డి ఫైర్‌ అవుతున్నట్టు చెబుతున్నారు. పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులకు సమాచారం కూడా ఇవ్వలేదని తప్పు పడుతున్నారట. కొంతకాలంగా పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై మహేశ్వర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారట. AICC ఇచ్చిన కార్యక్రమాల అమలులో ఇతరుల జోక్యం ఎక్కువైందని ఫీలింగ్‌లో ఉన్నారట ఈ నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే.

ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి దగ్గర ప్రకటించడంపై ఆగ్రహం!

తన పనుల్లో వేరే నాయకులు వేలు పెడుతున్నారని ఆగ్రహంతో ఉన్న మహేశ్వర్‌రెడ్డికి.. ఇంద్రవెల్లి సభ ప్రకటన మరింత చికాకు తెప్పించిదట. అందులోనూ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఆయన్ని ఇంకా హర్ట్‌ చేసినట్టు చెబుతున్నారు. జిల్లాల్లో యాక్టివ్‌గా లేని కాంగ్రెస్‌ నాయకుల్లో తిరిగి చురుకు పుట్టించేందుకు ఆ ప్రకటన చేసి ఉంటారని రేవంత్‌వర్గం మహేశ్వర్‌రెడ్డికి నచ్చజెప్పే పనిలో పడిందట.

ఇంద్రవెల్లి రగడపై ఫిర్యాదులు వెళ్తాయా?

పదవి చేపట్టే సమయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన పీసీసీ చీఫ్‌.. ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఏకపక్షంగా ప్రకటనలు చేయడం అసంతృప్తులకు ఆయుధంగా మారుతోంది. చీమ చిటుక్కుమంటే ఢిల్లీలో హైకమాండ్‌కు లేఖలు రాసే నాయకులు ఉన్న కాంగ్రెస్‌లో ఈ రగడ.. అక్కడి వరకు వెళ్తుందో లేదో కానీ.. పార్టీ వర్గాల్లో మాత్రం వాడీవేడీ చర్చ జరుగుతోంది. కలిసి నడిచేందుకు ఎవరూ పెద్ద మనసు చేసుకోవడం లేదని చెబుతూ.. అలకలు.. అసంతృప్తులు.. ఆగ్రహాలు కాంగ్రెస్‌లో మళ్లీ జోరందుకుంటున్నాయి.