అన్నవరం కొండపై వాళ్లే మూల విరాట్టులు. ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి దేవుడికే శఠగోపం పెడతున్నారు. ఆలయాన్ని అవినీతికి.. రాజకీయ పైరవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన ఉద్యోగుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. మరి.. ఇప్పటికైనా చర్యలుంటాయా.. మళ్లీ పైరవీలు చేస్తారా?
అన్నవరంలో పాతుకుపోయిన సిబ్బందికి నిద్ర కరువు!
అన్నవరం ఆలయంలో అవినీతి అధికారుల మూలాలు కదులుతున్నాయా? దేవాదాయశాఖ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారా? విషయం తెలుసుకున్న అక్రమార్కులు పెద్దస్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారా? రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా? ప్రస్తుతం రత్నగిరిపై జరుగుతున్న చర్చ ఇదే. బెజవాడ దుర్గగుడి ఘటన తర్వాత ఇతర ముఖ్య ఆలయాల్లోనూ భారీస్థాయిలో బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయాల్లో సిబ్బంది నివేదికను వెంటనే పంపించాలని ఈవోలను ఆదేశించారు కమిషనర్. ఈ కదలికల గురించి తెలుసుకున్న అన్నవరం ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. ఏళ్లతరబడి ఒకేచోట పాతుకుపోయిన వారికి నిద్ర కరువైంది.
2016 తర్వాత అన్నవరంలో బదిలీలు లేవు
అన్నవరంలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లోని సిబ్బందిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై పైవరకు ఫిర్యాదులు వెళ్లాయి. దేవుడి సొమ్మును సొంతానికి బొక్కేశారనే కథలు కథలుగా చెప్పుకొంటారు. చేతివాటానికి అనుకూలంగా ఉండటంతో.. తమ పీఠం కదలకుండా పైఅధికారులకు, రాజకీయ నాయకులకు ముడుపులు ఇచ్చి కాలాన్ని నెట్టుకొస్తున్నారు అక్రమార్కులు. అన్నవరంలో దాదాపు 250మంది పనిచేస్తున్నారు. 2016 నుంచి బదిలీలు లేవు. 2016 ఏప్రిల్‌లో 24 మందిని వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఏడాది తిరగకుండానే అన్నవరం తిరిగొచ్చేశారు.
అక్రమాలపై నేరుగా సీఎం, కమిషనర్‌లకు ఫిర్యాదు!
ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలోల పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఇప్పటీ వరకు సర్వీసులో ఒక్కసారి కూడా బదిలీ కాలేదట. వారికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నవరం ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై నేరుగా ముఖ్యమంత్రికి, దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు ఉద్యోగులు.. అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి కంప్లయింట్స్ అందాయట. ఇప్పటికే దుర్గగుడి.. శ్రీశైలం ఆలయ ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. రేపటి రోజున అన్నవరంలోకి ఏసీబీ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెవులు కొరుక్కుంటున్నారు.
ఏసీబీకి మూలవిరాట్టులు చిక్కుతారా?
సమస్య తీవ్రతను గమనించిన కొందరు అక్రమార్కులు.. బదిలీ చేస్తే కామ్‌గా వెళ్లిపోదామని.. తీవ్రత తగ్గిన తర్వాత ఎవరికీ తెలియకుండా అన్నవరం వచ్చేద్దామని అనుకుంటున్నారట. అయితే ఉద్యోగుల విద్యార్హతలు.. పదోన్నతుల కోసం సమర్పించిన సర్టిఫికెట్లపై అనుమానాలు ఉన్నాయట. వాటి కూపీ లాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య కొందరు ఉద్యోగులకు పదోన్నతలు లభించాయి. ఆ సందర్భంగా భారీగా చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. కొండపై మూలవిరాట్టులుగా ముద్రపడ్డ అధికారులు.. సిబ్బందిని ఏసీబీ టార్గెట్ చేస్తుందా? బదిలీ వేటు పడుతుందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో అక్రమార్కులు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
