Site icon NTV Telugu

Off The Record: నెల్లూరు జిల్లా టీడీపీలో అంతులేని మౌనం..

Otr Nlr Tdp

Otr Nlr Tdp

Off The Record: సింహపురిలో అధికార పార్టీ నేతలు సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతున్నారట. ఒకరిలో ఒకరికి కోఆర్డినేషన్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కోలేకపోతున్నారట. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మొదలుకొని.. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్న ప్రచారం సైకిల్ పార్టీలో వినపడుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకునేది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరూ నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉంటే..మరికొందరు మాత్రం నియోజకవర్గాల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వైసీపీ నేతల పోరాటాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న ప్రచారం జిల్లాలో జరుగుతోంది. సింహపురిలో ఒక్క సీటు కూడా గెలవని వైసీపీ..ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నా.. డిఫెన్స్ చేసే స్థితిలో కూడా అధికార పార్టీ నేతలు లేరట. సీఎం చంద్రబాబుతో పాటు.. లోకేష్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఆయనకు కౌంటర్ ఇచ్చే నేతలు అధికార టిడిపిలో కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు నారాయణ సైతం జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. నేను నా అమరావతి, నెల్లూరు సిటీ అంటూ మంత్రి నారాయణ వ్యవహరిస్తూ ఉంటే.. మంత్రి ఆనం మాత్రం ఆలయాలు, నైవేద్యాలు అంటూ తిరుగుతున్నారని క్యాడర్‌ నిట్టూరుస్తోంది.

జిల్లా అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర కూడా వైసిపి నేతల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారట. వాళ్లు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటారు ప్రతిదానికి మనం స్పందించాలా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారట ఇతర నేతలు. ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్ లు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తప్ప.. రాష్ట్ర రాజకీయాలపై గట్టిగా మాట్లాడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనం వెంకటరమణారెడ్డి సైతం సైలెంట్ మోడల్‌లోకి వెళ్లిపోయారట. నెల్లూరు యాసలో వైసీపీ అధినేత జగన్ తో పాటు.. అజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై గతంలో తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే, తాను ఆశించిన పదవి రాలేదన్నఅలకతో ఆయన మౌనంగా వున్నారని తెలుస్తోంది.

టీడీపీలో నోరున్న నేతలందరూ వైసీపీని పల్లెత్తు మాటా అనకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నేతలే సైలెంట్‌గా ఉంటే ఇక మాకెందుకు అన్నట్లుగా మండల స్థాయి నేతలు కూడా నోరు మెదపడం లేదట. ఆవేశంతో ఏదేదో మాటలాడేస్తే.. అధికారం మారితే అడ్డంగా బుక్ అవుతామేమో అన్న ఆలోచనలో నెల్లూరు టీడీపీ నేతలు ఉన్నారట. మరికొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే భావనలో డబ్బు సంపాదనలో నిమగ్నమయ్యారట. ఇలా తమ్ముళ్లందరూ సైకిల్ కి కొత్త బ్రేకులు వేసుకుని.. రాజకీయం నడిపిస్తున్నారట. అయితే, వైసీపీ విమర్శలకు దీటుగా సమాధానమిచ్చేలా నేతలను ఆదేశించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట కార్యకర్తలు.

Exit mobile version