Shankara Narayana is the target in Penukonda YCP : ఆ మాజీ మంత్రి కాలు బయట పెడితే నిరసనలు. జనాల్లోకి వెళ్తే నిలదీతలు. ఆ ఘటనలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఆయనే టార్గెట్ అవుతున్నారు? ఎవరా మాజీ మంత్రి? ఏంటా సంగతి? లెట్స్ వాచ్..!
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాలా మందికి ఎమ్మెల్యేలకు తలపోటుగా మారింది. లోకల్‌గా పట్టు ఉండి.. అనుచరగణం బాగా ఉన్న వారిని ప్రజలు వినయంగా అడుగుతున్నారు. మరికొందరు నేతల పరిస్థితి రివర్స్. ఈ రెండో జాబితాలో చేరారు మాజీ మంత్రి శంకర నారాయణ. మొదటి రెండు మూడు రోజులు గడప గడప కార్యక్రమం సాఫీగానే సాగినా.. తర్వాత పరిస్థితి మారిపోయింది. జనాల్లోకి వెళ్తే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి మాజీ మంత్రికి.
శంకర నారాయణ అడుగు పెడితే నిలదీతలే. ప్రభుత్వ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్న వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. అవి అందని ఒకరో ఇద్దరో మాత్రం గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. వాళ్లు వేస్తున్న ప్రశ్నలు.. డిమాండ్స్‌కు సమాధానం చెప్పే సావకాశం కూడా ఇవ్వడం లేదన్నది మాజీ మంత్రి అనుచరులు చెప్పేమాట. ఆ మధ్య పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామంలో లలితాబాయ్ అనే గిరిజన మహిళ 11 నెలలుగా పెన్షన్ రావడం లేదని చేసిన హంగామా కలకలం రేపింది. అప్పటికే విసుగ్గా ఉన్న శంకర నారాయణ తర్వాత చూద్దామని ముందుకు కదలడంతో ఆమె అసభ్య పదజాలంతో విరుచుకు పడింది. సోమందేపల్లి మండలం సప్తగిరి కాలనీలో 73 లక్ష్మక్క, గోరంట్ల ప్రాంతంలో లక్ష్మీదేవిలు రేషన్ కార్డుల సమస్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనలను అక్కడున్న వాళ్లు కెమెరాల్లోనూ.. సెల్‌ఫోన్లలోనూ రికార్డు చేస్తూ.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. మాజీ మంత్రి చెప్పే సమాధానం కంటే.. స్థానికులు వేస్తున్న ప్రశ్నలు, హంగామా ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. దాంతో పార్టీ వర్గాల్లో చర్చగా మారుతున్నారు శంకర నారాయణ.
వాలంటీర్లు సైతం అధికార పార్టీ నేతపై తిరగబడటం పెనుకొండ వైసీపీలో చర్చగా మారింది. శంకర నారాయణ రాజకీయాలకు కొత్త కాదు. చాలా ఏళ్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత మంత్రి పదవి పోయినా.. మరోసారి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. పెనుకొండలో ఆయనంటే గిట్టని నేతలు వైసీపీలో ఉన్నారు. ఆ పంచాయితీ కూడా పార్టీ పెద్దల దగ్గర పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం టార్గెట్ శంకర్ ఎపిసోడ్‌లో వారి పాత్ర ఉందో లేదో కానీ.. ఎక్కడా లేని విధంగా గడప గడప కార్యక్రమంలో శంకర నారాయణ గట్టిగానే ఫోకస్ అవుతున్నారు. మరి.. ఈ ప్రతికూల వాతావరణం నుంచి మాజీ మంత్రి గట్టెక్కుతారో లేదో చూడాలి.