NTV Telugu Site icon

ఎచ్చెర్లలో షాడో ఎమ్మెల్యే పెత్తనం?

ఆ నియెజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు..? ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరిని కలవాలి..? తాము ఓట్లేసి గెలిపించిన నేతను కలవలేక పోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్న నేత ఎవరు? శాసనసభ్యునికంటే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆవ్యక్తికి అంత క్రేజ్‌ ఎందుకు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం?

ఎచ్చెర్లలో షాడో ఎమ్మెల్యేగా కిరణ్‌ మేనల్లుడు సాయి..!?

గొర్లె కిరణ్‌కుమార్‌. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే. బయట వ్యక్తులు ఈ పేరే చెబుతారు. అదే ఎచ్చెర్ల నియెజకవర్గం వాసులైతే MLA అనగానే టక్కున మరోపేరు చెబుతారు. అధికారుల బదిలీలు మొదలు.. సమీక్షల వరకు ఆయనే కానిచ్చేస్తుంటాడట. ఆయనే ఎచ్చెర్ల షాడో ఎమ్మెల్యే పిన్నింటి సాయి. నియోజకవర్గంలో అంతా సాయి మయం. సాయి మాటలేదంటే అక్కడ పూచిక పుల్ల కూడా కదలటానికి లేదట. MLA కిరణ్‌కు షాడో సాయి స్వయాన మేనల్లుడు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు సొంత పార్టీ నేతలకు కనీసం ఎమ్మెల్యే కిరణ్‌ పలకరింపు కూడా దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మామ మనసులో అనుకున్నది మేనల్లుడు చేతల్లో చేస్తారా?

ఎచ్చెర్ల.. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం. రాజకీయంగా గుర్తింపు కలిగిన నియోజకవర్గం. కావలి ప్రతిభాభారతి, కళా వెంకట్రావ్‌, కొండ్రు మురళీ మెహన్, గొర్లె శ్రీరాములు నాయుడు తదితరులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. నాడు జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన గొర్లె శ్రీరాములు నాయుడు కటుంబానికే చెందిన కిరణ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వలస నేతలకు పట్టం గట్టిన ఎచ్చెర్ల వాసులు స్థానికుడైన కిరణ్‌ పై ఎన్నో ఆశలు పెట్టుకోని మంచి మెజార్టీతో గెలిపించారు. గెలిచింది కిరణ్ కుమార్‌ అయితే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంది.. చెలాయిస్తుంది మాత్రం ఆయన మేనల్లుడు పిన్నింటి సాయి. మామ మనసులో ఉన్నది మేనల్లుడు చేతల్లో చేస్తారట. ఆయన మాటకి ఏనాడూ అడ్డు చెప్పరట మామ కిరణ్‌. దీంతో అధికారులు, అనధికారులు అంతా కిరణ్‌ దర్శనం కావాలంటే సాయిని ప్రసన్నం చేసుకోక తప్పదట. మామాఅల్లుళ్ల కెమిస్ట్రీ పక్కన పెడితే.. ఎలక్షన్స్‌లో కష్టపడి పనిచేసిన కిందిస్థాయి నేతలకు ఎమ్మెల్యే అపాయింట్‌మెంట్‌ లేదని టాక్‌.

మేనల్లుడికి పగ్గాలు ఇచ్చి పక్కకు తప్పుకొన్నారా?

బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్‌ 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓటమితో.. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్టు పదేపదే చెబుతూ ఉండేవారు. ఎమ్మెల్యే కావాలన్నది ఆయన బలమైన కోరికట. మరి ఎమ్మెల్యే అయ్యాను నా పదవి నాకు ఉంది.. నా పని ఎవరు చేస్తే ఏం అనుకున్నారో ఏమో.. మేనల్లుడికి ఆ పగ్గాలు ఇచ్చి పక్కకు తప్పుకొన్నారు కిరణ్‌. నేడు ఎమ్మెల్యే కిరణ్‌, ఆయన మేనల్లుడు సాయి తీరు చూస్తే ఇంకోసారి శాసన సభ్యుడిగా గెలిచే అవకాశం కిరణ్‌కు లేదని అనుచరులే తెగేసి చెబుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా ఇద్దరరూ వ్యవహరిస్తున్నారట.

ఎచ్చెర్లలో పనులన్నీ షాడో కనుసన్నల్లోనే..!

రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లు.. భూ తగాదాలు తీర్చడంలో ఉన్న శ్రద్ధ ఎచ్చెర్లలో ప్రజా సమస్యలపై చూపెట్టడం లేదట. రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయి. కానీ.. వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోపర్చుకున్నవాళ్లే నాయకులు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, లావేరు, జి. సిగడాం, ఎచ్చెర్ల మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో సివిల్‌ కాంట్రాక్ట్‌ వర్కులే కాదు.. గ్రావెల్‌, ఇసుక వ్యాపారం అంతా షాడో సాయి కనుసన్నలలోనే జరిగిందట. షాడో డైరెక్షన్‌లో రణస్థలం కేంద్రంగా రియల్‌ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ నేతలతో అంటకాగేంతగా ఎచ్చెర్లలో రియల్‌ ఎస్టేట్‌ దందా విస్తరించిందని చెబుతారు. దీంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన వాళ్లు లోలోన మధన పడుతున్నారట. మరి.. షాడో నీడ నుంచి బయట పడతారో.. లేక ఒక్కసారి ఎమ్మెల్యే సరిపోతుందని కిరణ్‌ భావిస్తారో చూడాలి.