దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారు నాయకులు. పదవిలో ఉండగానే వారసులను జనాలకు పరిచయం చేయడం.. వీలైతే ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటారు. ఆ ఎమ్మెల్యే కూడా అదే చేశారు. కాకపోతే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే.. తనయుడు షాడోగా పెత్తనం చేయడమే ఆ నియోజకవర్గంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా షాడో? ఏమా కథ?
బాజిరెడ్డి కుమారుడి తీరుపై పార్టీలో చర్చ..!
బాజిరెడ్డి గోవర్దన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ అయ్యారు గోవర్దన్. మంత్రి కావాలనే ఆయన కోరిక తీరలేదు. వయసు మీద పడుతుండటంతో వారసుడిగా కుమారుడు జగన్‌ను జనానికి పరిచయం చేశారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి ప్లేసులో తనయుడు ఎమ్మెల్యేగా బరిలో దిగుతారని చర్చ జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాజిరెడ్డి కుమారుడి తీరే టీఆర్ఎస్ వర్గాల్లో చర్చగా మారింది.
ఎమ్మెల్యేకు షాడోగా జగన్ మారడంపై పార్టీలో చర్చ..!
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి జడ్పీటీసీగా ఉన్నారు బాజిరెడ్డి జగన్. ఈ మధ్యే నియోజకవర్గం అంతా పర్యటిస్తున్న జగన్.. పార్టీ, ప్రభుత్వ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సిరికొండ, డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొనటంపై ఇతర ప్రజాప్రతినిధులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యే గోవర్దన్ వారసుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఓకే. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో జగన్ ముఖ్యఅతిథిగా రావడాన్ని వారు ప్రశ్నిస్తున్నారట. ఆయన ఒక జడ్పీటీసీ అని గుర్తు చేస్తున్నారట. షాడోగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం.
కుమారుడి ఎంట్రీతో పార్టీలో ఆశావహుల డైలమా?
కుమారుడిని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని చేయాలని ఎమ్మెల్యే గోవర్దన్ ఆశించారు. ఇంతలో ఆయనకే ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో.. ఇప్పుడు కుమారుడికి పార్టీ పదవి వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్దన్ పోటీ చేయకపోతే.. అక్కడ పార్టీ టికెట్ అడగాలని చాలా మంది కాచుకుని ఉన్నారు. ఇప్పుడు జగన్ ఎంట్రీతో వాళ్లు డైలమాలో పడ్డారట. ఈ అడ్డంకులను దాటుకుని మెయిన్ స్ట్రీమ్‌లోకి కుమారుడిని తీసుకొచ్చే సమయం కోసం బాజిరెడ్డి గోవర్దన్ వేచి చూస్తున్నట్టు టాక్. మరి… ఎమ్మెల్యేకు ఆ టైమ్ ఎప్పుడొస్తుందో.. వారసుడికి లైన్ ఎలా క్లియర్ చేస్తారో చూడాలి.
