NTV Telugu Site icon

Telangana National Integration Day :హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 హీట్

Flexi War

Flexi War

సెప్టెంబర్‌ 17 దగ్గర పడేకొద్దీ.. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడమే దానికి కారణం. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణలో గులాబీ, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య కూడా ఆ వార్‌ ప్రభావం కనిపిస్తోంది. నిత్యం రెండు పార్టీల నేతలది మాటలయుద్ధమే. అదీ తీవ్ర పరుష పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ప్రస్తుతం రెండు శిబిరాల మధ్య సెప్టెంబర్‌ 17పై వివాదం జరుగుతోంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుంటే.. జాతీయ సమైక్యతా దినం పేరుతో చేపట్టే కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హైదరాబాద్‌ వేదికగా పోటాపోటీ కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి కూడా. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సర్కార్‌ నిర్వహించే కార్యక్రమానికి సెంట్రల్ హోంమినిస్టర్‌ అమిత్‌ షా హాజరవుతున్నారు.

పరేడ్‌ గ్రౌండ్స్‌ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్టహాసంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే రెండు ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం ప్రకటనల గొడవ నడుస్తోంది. ఫ్లెక్సీల వార్‌ పీక్స్‌కు చేరుకుంటోంది. విమోచన వేడుకల పేరుతో చేపట్టే కార్యక్రమాలను ప్రచారం చేసుకునేందుకు వివిధ వేదికలను ఉపయోగించుకోవాలని కేంద్ర సర్కార్ చూస్తోంది. మెట్రో పిల్లర్లపై కేంద్రం యాడ్స్‌ వేయాలని ప్రణాళికలు వేసింది. అయితే మెట్రోపిల్లర్ల దగ్గర ఉన్న ప్రకటనల సైన్‌ బోర్డులన్నింటినీ టీఆర్ఎస్‌ సర్కార్‌ ముందుగానే బుక్‌ చేసేసుకుంది. నగరంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కకుండా ముందస్తు ప్లాన్‌ వేసింది గులాబీ శిబిరం. ప్రకటనల సంస్థలతో వారం రోజులు ముందుగానే ఒప్పందాలు చేసేసుకుందట. చివరకు సిటీ బస్టాప్‌ల దగ్గర ఉండే సైన్‌బోర్డుల స్లాట్‌లు కూడా రాష్ట్రసర్కారే బుక్‌ చేసేసిందట. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అభ్యంతరం తెలిపారు. ప్రకటనలు చేసుకునేందుకు తమకూ కొన్ని స్లాట్లు ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది.

ఇదే కాదు.. సెప్టెంబర్‌ 17న చేపట్టే కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అడిగారట. అప్పటికే బస్సులను రాష్ట్ర సర్కార్‌ బ్లాక్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులు అందుబాటులో లేవని ఆర్టీసీ యాజమాన్యం బదులిచ్చిందట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారికంగా లెటర్‌ ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేయడంతో.. బస్సుల రెంట్ పెంచేసినట్టు బీజేపీ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా రెండు పార్టీల వార్‌ ఇలాగే నడిచింది. పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టుకుని కవ్వింపు చర్యలకు దిగారు. నాడు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ సభకు దారితీసే రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వ సైన్‌బోర్డులే కనిపించాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్‌ అవుతుందనే వాదన ఉంది. రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో కేంద్ర సర్కార్‌ ఆలస్యంగా మేల్కొనడంపైనా బీజేపీలోనే భిన్న వాదనలు ఉన్నాయట. జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఎదురైన ఘటనలను గుర్తు చేసుకునైనా ముందే ఎందుకు మేల్కోలేదని ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి సందర్భం ఏదైనా.. టీఆర్ఎస్‌, బీజేపీల వార్‌ కామన్‌గా మారిపోయింది. మరి.. సెప్టెంబర్‌ 17న పోటాపోటీగా ఎలాంటి సిత్రాలు కనిపిస్తాయో చూడాలి.