Site icon NTV Telugu

బండ ప్రకాష్ రాజీనామాతో సీటు ఖాళీ..నోటిఫికేషన్ ఎప్పుడో ?

Okati

Okati

రాజ్యసభ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ మాటే లేదు..!

టీఆర్ఎస్‌ నేత బండ ప్రకాష్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో ప్రకాష్‌ రాజీనామా చేయడం.. ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా చేసే సమయానికి బండ ప్రకాష్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఇంకా రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. 2024 ఏప్రిల్‌ వరకు పదవీకాలం ఉన్న ఆ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వస్తే.. ఎంపీగా ఢిల్లీ వెళ్లాలని చాలామంది టీఆర్‌ఎస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. చూస్తుండగానే ఐదు నెలలు గడిచిపోయింది. కానీ.. ఎన్నికల సంఘం నుంచి ఉపఎన్నిక మాటే లేదు.

వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు ఇస్తోంది కానీ.. తెలంగాణలో ఖాళీ అయిన ఒక్క రాజ్యసభ సీటు విషయంలో ఎలాంటి అలికిడి లేదు. ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందో అర్థం కావడం లేదట. తెలంగాణలో మరో రెండు రాజ్యసభ స్థానాలు జూన్‌ మూడో వారంలో ఖాళీ అవుతున్నాయి. దాంతో ఆ రెండింటితోపాటు బండ ప్రకాష్‌ రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీకి కూడా అప్పుడే షెడ్యూల్‌ రావొచ్చన్నది కొందరి వాదన.

టీఆర్ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లిన డి శ్రీనివాస్‌.. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుల పదవీకాలం జూన్‌లో ముగియనుంది. త్వరలోనే ఆ స్థానాల భర్తీకి షెడ్యూల్‌ రావొచ్చని అనుకుంటున్నారు. దాంతో టీఆర్ఎస్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే వీలుంది. చాలా మంది ఆశావహులు ప్రగతిభవన్‌వైపు చూస్తున్నారు. అధిష్ఠానం కూడా కొందరి పేర్లను వడపోస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్‌ భావిస్తోంది. ఆ దిశగానే ఢిల్లీ స్థాయిలో ఇతర పార్టీలతో చర్చలు జరపగల నాయకులను రాజ్యసభకు ఎంపిక చేస్తారని వాదన నడుస్తోంది. రెండేళ్ల పదవీకాలం ఉన్న సీటు విషయంలోనూ అదే ఫార్ములా అనుసరించొచ్చని అనుకుంటున్నారట. అందుకే అధినేత మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట కొందరు నాయకులు. మొత్తానికి అటు నోటిఫికేషన్‌ ఆలస్యం.. ఇటు పార్టీ వడపోతలు.. గులాబీ శిబిరంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Exit mobile version