NTV Telugu Site icon

Raptadu Assembly : గన్ మెన్లను పక్కన పెట్టి రా తేల్చుకుందాం అంటున్న రాప్తాడు నేతలు

Raptadu

Raptadu

తగ్గేదే లే..! రాప్తాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. ‘గన్‌మెన్‌ను పక్కనపెట్టి రా..! నీ పెతాపమో.. నా పెతాపమో చూసుకుందాం’ అని ఓ రేంజ్‌లో సవాళ్లు వినిపిస్తున్నాయి. సమస్య ఏదైనా కొత్తగా మాటల తూటాలు పేల్చుకుంటూ పాత అంశాలను తవ్వుకుంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు.

ఎక్కడైనా ఏదన్న సమస్య, ఇబ్బంది వస్తే రాజకీయ నేతల మధ్య రగడ కామన్‌. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో మాత్రం అలాంటివి ఏవీ అవసరం లేదు. దశాబ్దన్నర కాలంగా ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం.. తోపుదుర్తి ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గముంటోంది. నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు నాయకులు. గత మూడు ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల ఫ్యామిలీ పైచెయ్యి సాధిస్తే.. 2019లో మాత్రం సీన్‌ రివర్స్‌. మూడేళ్లుగా రెండు వర్గాల మధ్య విమర్శల కంటే.. సవాళ్లు.. వార్నింగ్‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.

పరిటాల కుటుంబం పేరు ఎత్తితే చాలు.. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అస్సలు ఊరుకోవడం లేదు. కొత్త అంశాలను… పాత విషయాలను తవ్విపోస్తూ ఆరోపణలు చేస్తున్నారు. పరిటాల ఫ్యామిలీ ఆస్తులపై ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రకాష్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి కూడా. ప్రభుత్వం మీకు భద్రత కల్పిస్తోందని.. మేము కాపాడుకుంటున్న ప్రాణాలు మీరని ప్రకాష్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ ప్రత్యర్థి శిబిరాన్ని అట్టుడికించాయి. అక్కడితో ఆగకుండా గన్‌మెన్‌ లేకుండా మీరు గడప కూడా దాటి బయటకు రాలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎమ్మెల్యే.

ఎమ్మెల్యే కామెంట్స్‌ ప్రత్యర్థి శిబిరానికి మరింత మంటెక్కించాయి. పరిటాల శ్రీరామ్‌ పదునైన విమర్శలే కాదు.. తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు కూడా. ఫ్యాక్షనిజానికి ఆజ్యం పోసిందే మీ నాయన.. మీ అన్నదమ్ములని ఎదురు దాడి శ్రీరామ్‌ ఎదురుదాడి చేశారు. ఎన్నికలకు ముందు ఇంటిని అమ్ముకునే స్థాయి నుంచి ప్రస్తుతం కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసని.. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు శ్రీరామ్. అంతేకాదు.. పరిటాల కుటుంబం చరిత్ర చెప్పాలంటే రోజులు సరిపోవని కవ్వించారు. గన్‌మెన్‌ లేకుండా బయటకు రావడానికి తాము సిద్ధమని.. మీరు సిద్ధమా అని సవాల్‌ విసిరారు పరిటాల శ్రీరామ్‌.

రాప్తాడులో మూడేళ్లుగా రెండు వర్గాల మధ్య ఈ తరహా మాటల యుద్ధం కనిపిస్తున్నా.. ఇప్పుడు మాత్రం మరింత పదును తేలుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణానికి అనుగుణంగా ప్రజల అటెన్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నారో ఏమో.. తగ్గేదే లేదన్నట్టుగా ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ కామెంట్స్‌ ఉంటున్నాయి. రేపోమాపో ఎన్నికలన్నట్టుగా మాటలు దూసేస్తున్నారు. అందుకే ఎన్నికల నాటికి ఈ వేడి ఇంకెంత సెగలు రేపుతుందో చూడాలి.