Site icon NTV Telugu

Ramagundam Congress Issue : రామగుండం కాంగ్రెస్ లో మూడు ముక్కలాట

Congress

Congress

Ramagundam Congress Issue : అక్కడ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందా? టికెట్‌ కోసం కుంపట్లు రాజేస్తున్నారా? పోటాపోటీ సమావేశాలు పార్టీకి మేలు చేస్తాయా… కీడు చేస్తాయా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు?

రామగుండం నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ నాయకుల తీరు పార్టీ వర్గాల్లో రచ్చ రచ్చ అవుతోందట. వ్యక్తిగత ప్రతిష్టల కోసం గందరగోళం సృష్టిస్తున్నట్టు కేడర్‌ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ బలోపేతానికి కాకుండా.. వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రూపులు కడుతున్నారట నాయకులు. ముఠా మేస్త్రీలుగా మారి పీసీసీనీ ఇరకాటంలో పెడుతున్నట్టు టాక్‌.

కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మక్కన్‌ సింగ్‌ ఠాగూర్‌, మంచిర్యాలకు చెందిన జనక్‌ ప్రసాద్‌.. మరో కాంగ్రెస్‌ నేత మధ్య అస్సలు పొసగడం లేదు. గత ఎన్నికల్లో మక్కన్‌ సింగ్‌ పోటీ చేశారు. ఓడినా ఆయనే ఇక్కడ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారట. కాంగ్రెస్‌ పెద్దల నుంచి ఆ మేరకు హామీ ఉందని చెబుతున్నారట. కానీ.. సొంత పార్టీ నేతల నుంచి పోటీ పెరగడంతో రాజకీయం రసకందాయంలో పడుతోంది. INTUC కోటాలో రామగుండం టికెట్‌ తనకే అని జనక్‌ ప్రసాద్‌ చేస్తున్న ప్రచారం పార్టీ వర్గాల్లో గుబులు రేపుతోందట.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కడంతో.. ఆ ప్రభావం రామగుండం కాంగ్రెస్‌లో సెగలు రేపుతోంది. రెండు మూడు నెలల ముందు ఉన్న పరిస్థితికి.. ఇప్పుడు నేతలు వేస్తున్న ఎత్తుగడలకు అస్సలు పొంతన లేదు. ఎవరికి వారు కుంపట్లు రాజేస్తున్నారు. ముఠాలు కట్టి పార్టీపై ఒత్తిడి పెంచే పనిలో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో రామగుండం పరిస్థితిపై పీసీసీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెళ్తున్నాయి. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు.. అనుచరులతో కలిసి నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు అలజడి రేపుతున్నాయి.

AICCతోపాటు పీసీసీలో తమకు పరిచయం ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. టికెట్ వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారట. రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉందని.. దానికి తమ అర్థ అంగబలం కలిసి వస్తుందని.. గెలుపు ఖాయమని చాలా లెక్కలు వివరిస్తున్నారట. ఈ వర్గపోరు సిసలైన కాంగ్రెస్‌ కేడర్‌కు మింగుడుపడటం లేదు. అసలే విపక్షంలో ఉన్నాం.. రెండు దఫాలుగా అధికారానికి దూరంగా ఉండిపోయాం.. ఇప్పుడు వర్గపోరుకు చెక్‌ పెట్టకపోతే మొదటికే మోసం రావొచ్చని హెచ్చరిస్తున్నారట. మరి.. కాంగ్రెస్‌ పెద్దలు రామగుండం ముఠాల దూకుడికి బ్రేక్‌లు వేస్తారో లేదో చూడాలి.

 

 

Exit mobile version