Site icon NTV Telugu

Rajahmundry YCP Politics : రాజమండ్రి వైసీపీలో వర్గపోరు..!

Ycp

Ycp

మాకో లీడర్‌ కావాలి. ఆ చారిత్రక నగరంలోని వైసీపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి వర్కవుట్‌ కావడం లేదు. పార్టీకి ఉన్న వేవ్‌ను పట్టుకోవడంలో సక్సెస్‌ కావడం లేదట. దీంతో చుక్కాని లేక దిగాలు చెందుతున్నాయి శ్రేణులు. అదెక్కడో ఇప్పుడు చూద్దాం.

ఏపీలోని రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం రాజమండ్రి. గత ఎన్నికల్లో ఇక్కడ అర్బన్‌, రూరల్‌ సీట్లు వైసీపీ ఖాతాలో పడలేదు. వైసీపీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ .. వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ఎన్నికల్లో బోల్తా కొట్టారు లోకల్‌ లీడర్స్‌. ఆ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా.. మూడేళ్లుగా రాజమండ్రి వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలిన వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నా.. స్థానిక నేతలకు చీమ కుట్టినట్టు అయినా లేదట.

అప్పట్లో ఉభయ గోదావరిజిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. రాజమండ్రిలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ప్లేస్‌లో ఎంపీ మిధున్‌రెడ్డి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. మిధున్‌రెడ్డి పలుమార్లు పార్టీ నేతలతో మాట్లాడినా.. లోకల్‌ లీడర్స్‌ ఒక పట్టాన లొంగడం లేదట. కలహాలు వీడటం లేదని సమాచారం. రాజమండ్రిలో వైసీపీపి పార్టీ ఆఫీసు లేదు. ఎంపీ మార్గాని భరత్‌ క్యాంప్‌ కార్యాలయంలోనే పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఈ మూడేళ్ల కాలంలో రాజమండ్రి కోఆర్డినేటర్లుగా ముగ్గురు మారారు. ఆ ప్రయోగం కూడా సక్సెస్‌ కాలేదు.

మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాషరావు, APIIC మాజీ ఛైర్మన్‌ శివరామ సుబ్రమణ్యం, మరో మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసినా.. వివిధ కారణాలు చెబుతూ తమ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుతం రాజమండ్రి వైసీపీకి కోఆర్డినేటర్‌ లేరు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నా.. అదనంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను కన్వీనర్‌గా పెట్టారు. మరి ఒక్క ఇంఛార్జ్‌ కూడా లేని రాజమండ్రిలో మాత్రం.. నాయకత్వం సమస్య కొలిక్కి రావడం లేదట. రాజమండ్రిలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు ఒక వర్గంగా.. ఎన్నికల ముందు.. పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతలు మరో వర్గంగా కొనసాగుతున్నారు.

వైసీపీ అధిష్ఠానం చేసిన సర్వేలన్నీ రాజమండ్రిలో నెగెటివ్‌గానే వస్తున్నాయట. ఇప్పటికే మేయర్‌ ఎన్నికలు బకాయి ఉన్నాయి. మరో 20 నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అయినప్పటికీ స్థానికంగా నాయకత్వం సమస్య పట్టిపీడిస్తోంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అభ్యర్థులు కావాలని ప్రకటన చేసుకోవాల్సిన దుస్థితి ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. రాజమండ్రిలో ముఠాలను చూశాక నాయకత్వం మీద ఆశ ఉన్నవాళ్లు సైతం భయపడిపోతున్నారట. అందుకే టికెట్‌ ఆశిస్తున్న వారు ముందుకొచ్చి నోరు విప్పడానికి జంకుతున్నారు. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని కొందరు.. హైకమాండ్‌ పిలిస్తే చూద్దామని మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారట. ఎమ్మెల్యేతోపాటు మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నాయి శ్రేణులు. మరి.. వైసీపీ పెద్దలు రాజమండ్రి వైసీపీకి ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.

Exit mobile version