రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వకముందే నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందా? కుస్తీకి సిద్ధం అవుతున్నారా? జోడో బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతున్న కార్యక్రమాలు ఎవరివి వారివేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల ఐక్యత ఎండమావే. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డెం అంటారు. అధిష్ఠానం పిలిచి.. కలిసి ఉండాలని చెప్పినా తీరు మార్చుకోరు నాయకులు. పార్టీలో అంతర్గత అంశాలైనా.. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర అయినా.. పంతాలు వీడరు నేతలు. అది ఆధిపత్య పోరు అనుకున్నా… అంతర్గత కలహాలుగా భావించినా.. ఇవన్నీ కాంగ్రెస్‌లోనే సాధ్యమన్నది సుస్పష్టం. ఢిల్లీలో ప్రియాంకాగాంధీతో భేటీ తర్వత కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిది ఒకదారైతే.. ఆయన్ని వ్యతిరేకించే వారిది ఇంకోదారి.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రపై… తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి గాంధీభవన్‌లో ఈ నెల 6న యూత్ కాంగ్రెస్ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ర్యాలీని ప్రారంభించారు రేవంత్‌రెడ్డి. అయితే పోస్టర్ ఆవిష్కరణపై పార్టీలోని మిగిలిన నాయకులు అసంతృప్తితో ఉన్నారట. దీనిపై సమాచారం ఇవ్వలేదన్నది వాళ్ల ఫీలింగ్. దీంతో ఎవరి వ్యూహం వాళ్లు అమలు చేసే పనిలో పడ్డారట.
రేవంత్‌రెడ్డి భారత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణకు కౌంటర్‌గా.. సీఎల్పీలో పార్టీ సీనియర్ నేత VH పోస్టర్ విడుదల చేయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేతలు మీదుగా.. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. బడుగు బలహీన వర్గాలు జోడో యాత్రకు అండగా.. అనేలా పోస్టర్ తయారు చేయించారు VH. అంతేకాదు.. తమను రేవంత్ పిలవలేదు. అందుకే మాది మేము చేసుకుంటున్నాం అన్నారో సీనియర్ నాయకుడు. అయితే.. గాంధీభవన్‌లో ఆవిష్కరించిన పోస్టర్… యూత్ కాంగ్రెస్‌కి చెందినదిగా రేవంత్ వర్గం చెబుతోంది.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. రాహుల్ జోడో యాత్రపై ఆచి తూచి స్పందించారు. రాహుల్ పాదయాత్ర విషయం తనకు తెలియదని.. కేవలం వాట్సాప్ మెసేజ్‌లోనే చూశానని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రాహుల్‌ను నడిపించడం ఎందుకు… లింగంపల్లి..పఠాన్‌చెరు.. ముత్తాంగి మీదుగా యాత్ర వెళ్తే బాగుంటుందని సూచించారు జగ్గారెడ్డి. గాంధీ భవన్‌లో నిర్వహించే సమావేశానికి వెళ్లి.. ఈ అంశంపై పీసీసీతో మాట్లాడతానని అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన చెప్పారు. కానీ ఆఖరి నిమిషంలో జగ్గారెడ్డి గాంధీ భవన్‌కి రాలేదు. రాహుల్ పాదయాత్ర వెళ్లే ప్రాంతాలపై.. అక్కడి నేతలకే సమాచారం లేదనే అభిప్రాయంలో జగ్గారెడ్డి ఉన్నారట. ఇప్పటి వరకు తెలంగాణలో రాహుల్ టూర్ షెడ్యూల్‌పై క్లారిటీ లేదన్నది రేవంత్ వాదన. షెడ్యూల్ అంతా దిగ్విజయ్ సింగ్.. జైరాం రమేష్‌లే చూస్తున్నారట.
ఆ మధ్య వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ నిర్వహించారు. అప్పటి నుంచి టీ కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇప్పుడు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర ఎంట్రీ ఇచ్చాక కూడా నేతల తీరు ఇలాగే ఉంటుందో.. మరిన్ని సిత్రాలకు నేతలు ఆస్కారం కల్పిస్తారో చూడాలి.