Ponnam Prabhakar : జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీకి అడుగడుగునా ఆటంకాలేనా? గత ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంటైన ఆయన.. తన మార్కు కోసం ప్రయత్నిస్తున్నారా? జిల్లా నేతలతో ఉన్న విభేదాలపై పరోక్ష విమర్శలు అందుకేనా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ..?
పొన్నం ప్రభాకర్. కరీంనగర్ మాజీ ఎంపీ. కాంగ్రెస్ నేత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా కోలుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేతల్లో ఒకరు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో ఆయన కూడా గేర్ మార్చేశారు. జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు చూస్తున్నారు పొన్నం.
కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేశారు పొన్నం ప్రభాకర్. అయినప్పటికీ మాజీ ఎంపీకి వర్గపోరు తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచే సపోర్ట్ లేదని టాక్. బీజేపీ, టీఆర్ఎస్‌లపై విమర్శలు చేస్తూనే.. ఇటీవల సొంతపార్టీ నేతలపై కూడా ప్రభాకర్ విరుచుకుపడటంతో సీన్ రివర్స్ అయిందని తెలుస్తోంది. అందుకే కొందరు దూరం జరిగారట.
కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు ఉన్నాయని తాజాగా వ్యాఖ్యలు చేశారు పొన్నం. ఇప్పటికే సీనియర్ల వైఖరితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధిష్ఠానానికి పొన్నం కామెంట్స్ సెగ కూడా ఇబ్బందిగా మారిందట. దాంతో ఆయన ఎందుకలా మాట్లాడారు అని ఆరా తీస్తున్నారట. ఇదే సమయంలో పార్టీలో తిరిగి పట్టుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ముందుకెళ్లడం లేదు. దీంతో కొందరు నేతలకు పొన్నం వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇది కేడర్‌ను గందరగోళంలో పడేస్తోందట.
ఇంతకీ జిల్లాలో పొన్నంతో విభేదిస్తోంది ఎవరు? ఎంపీ టికెట్ ఆశిస్తున్న వాళ్లు ఆయనకు చెక్ పెడుతున్నారా? అందుకే పొన్నం తన అసంతృప్తిని విమర్శల రూపంలో బయట పెడుతున్నారా? మరి.. ఆయనకు ఊరట లభిస్తుందా? అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా? పార్టీ పెద్దలు సమస్యను పరిష్కరిస్తారా? ప్రస్తుతం పార్టీ కేడర్‌లో నెలకొన్న ప్రశ్నలివే. మరి.. ఈ ఆటంకాలను పొన్నం ప్రభాకర్ అధిగమిస్తారో లేదో చూడాలి.