NTV Telugu Site icon

వైసీపీ లో ఆ నాయకులకు ఫోన్స్ అంటే దడ పట్టుకుందా..?

List

List

ఏపీలో వైసీపీ నాయకుల పరిస్థితి సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్ చేసుకుంటున్న విద్యార్ధుల్లా ఉంది. మూడేళ్లు ప్రభుత్వ పాలనను రివైజ్ చేసుకుంటూనే.. వచ్చే రెండేళ్లు ఎన్నికలకు సమాయత్తం అవుతోంది పార్టీ. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పనితీరే కాదు ఎమ్మెల్యేల పనితీరు కూడా కీలకమే. అందుకే పార్టీ హైకమాండ్ కొద్దిరోజులుగా సర్వేల ప్రక్రియ చేపట్టింది. చాలా మంది ఎమ్మెల్యేల ప్రొగ్రస్‌ రిపోర్ట్ 40 నుంచి 45 శాతం దాటడం లేదని.. సరి చేసుకోవాలని పార్టీ అధినేత సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించారు. గ్రాఫ్‌ పెంచుకోవడానికి ఆరు నెలల నుంచి ఏడాది గడువు ఇచ్చారు. ఈ లోగా పరిస్థితిలో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని తేల్చేశారు అధినేత.

వైసీపీ ఎమ్మెల్యేలలో దాదాపు మూడింట ఒక వంతు ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి సగటున 60 శాతం అనుకూలత వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు గాడిలో పడాల్సి ఉందని టాక్‌. క్షేత్రస్థాయిలో పెర్ఫార్మెన్స్ సరిగాలేని ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల నుంచి ఫోన్లు వెళ్తున్నాయట. తాడేపల్లికి రావాలని పిలుస్తున్నారు. కొంతమందితో నేరుగా సీఎం మాట్లాడుతున్నట్టు సమాచారం. మరికొందరికి సజ్జల రామకృష్ణారెడ్డి క్లాస్ తీసుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ డోస్ లెవెల్ ఫుల్‌గానే ఉందని.. క్షేత్రస్థాయిలో మీ గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది అంటూ సర్వే లెక్కలతోపాటు రిపోర్ట్‌ కార్డును తమను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేల ముందు పెడుతున్నారట. లోపలు ఎక్కడున్నాయి? ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అవినీతి, ఇతర ఆరోపణలు ఉన్నాయా? సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై వ్యక్తం అవుతున్న అభిప్రాయం… కార్యకర్తలు, కిందిస్థాయి నేతలు ఏమనుకుంటున్నారు? ఇలా అన్ని విషయాలపై సర్వే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. లోటుపాట్లను సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారట.

ఈ పోస్టుమార్టం చూశాక… వైసీపీ ఎమ్మెల్యేలలో అంతకంతకూ టెన్షన్ పెరగుతున్నట్టు సమాచారం. ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆందోళన చెందుతున్నారట. అసలు తమకు ఎన్ని మార్కులు పడ్డాయో..? తమ గ్రాఫ్‌ ఎలా ఉందో..? బార్డర్‌లోనైనా ఉన్నామా లేదా? అని పార్టీ వర్గాల దగ్గర ఆరా తీస్తున్నారట. తమ మీద తమకు కాస్త డౌట్ ఉన్న ఎమ్మెల్యేలు
ఇప్పటికే హైకమాండ్‌ దగ్గర క్లాస్ తీసుకున్న వారికి ఫోన్లు చేసి.. డోస్ ఏ లెవెల్‌లో ఉందో వాకబు చేస్తున్నారట. కొందరైతే తాము చేసిన పనుల జాబితాతో.. ఫైల్ సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నారట. స్టడీ క్లాసుల్లో స్టూడెంట్‌లా కొందరు ఎమ్మెల్యేలు చాలా సీరియస్‌గా హోంవర్కు చేస్తున్నారట. మొత్తానికి పార్టీ పెద్దల దగ్గర ఉన్న లిస్ట్‌లో లీస్ట్‌లో ఉన్నదెవరో? పాస్‌ మార్కులు పడ్డదెవరికో తెలియక నిద్రకు దూరమయ్యారట ఎమ్మెల్యేలు.