Off The Record: సినిమాలు, రాజకీయాల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా అంటే… యస్ అన్నదే సమాధానం. ఓవైపు పవర్ పాలిటిక్స్ చేస్తున్నా, మరోవైపు తనకు గుర్తింపు తెచ్చిన ఇప్పటికీ పోషిస్తోందని చెప్పుకుంటున్న సినిమా రంగాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇప్పుడాయన కొత్త సినిమాలకు సైన్ చేయడం గురించి రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ డ్యూయల్ రోల్ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతుండగా, పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం డౌట్స్ పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో అధికారంలోకి వచ్చాక… కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు పవన్. తన మీద బాధ్యత మరింత పెరిగిందని, ఇక నుంచి రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారాయన. దాంతో చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక ఇక క్లాప్‌కు దూరమవుతారని చాలామంది ఊహించుకున్నారు. అభిమానుల్లో అయితే ఒక రకమైన నిరాశాభావం కూడా కనిపించింది. కానీ… తాజాగా కొత్త సినిమాకు ఓకే చెప్పడంతో… ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ అవుతుండగా… పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి. పవన్ గతంలో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తోంది ఏంటి? ఇక వరుసబెట్టి సినిమాలు చేస్తూ పోతారా? అలాగైతే… రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషించడం సాధ్యమేనా? పార్టీకి పూర్తి సమయం కేటాయించగలుగుతారా అన్న చాలా ప్రశ్నలు వస్తున్నాయి వివిధ వర్గాల్లో. సాధారణంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రజల మధ్య ఉండటానికే కేటాయిస్తుంటారు. కానీ… పవన్ వరుస సినిమాలు చేస్తూ పోతుంటే…అది సాధ్యమవుతుందా అన్నది బిగ్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో… అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఓవైపు ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే…. పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ పూర్తి చేశారు.
READ MORE: Nagarjuna Sagar-OTR: సాగర్ షాడో.. ఆ సార్ తల్చుకుంటే రాష్ట్ర సరిహద్దులు సైతం చెరిగిపోతాయ్!
వీటిలో రెండు సినిమాలు రిలీజవగా… ఉస్తాద్ భగత్‌సింగ్ మాత్రమే ఇంకా బొమ్మ పడాల్సి ఉంది. పెండింగ్ సినిమాల ప్యాకప్ తర్వాత… ఇప్పుడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో కొత్త సినిమాకు ఓకే చెప్పి సెట్స్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు పవన్. తన పార్టీ నడపడానికి కావాల్సిన ఆర్థిక ఇంధనాన్ని సినిమాలే అందిస్తున్నాయని గతంలో ప్రకటించారు పవన్. ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తున్నారన్నది ఒకవెర్షనైతే… వరుస సినిమాలు ఒప్పుుకుంటే పొలిటికల్‌గా ఫోకస్ పెట్టగలుగుతారా? తన పరిధిలోని శాఖలకు న్యాయం చేయగలుగుతారా అన్నది ఇంకో వెర్షన్. ఈ రెండిటి మధ్య ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారన్న అనుమానాలు కొందరు జనసేన నేతల్లోనే ఉన్నాయట. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రోజా… ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీవీ షోలు చేసినా… కేబినెట్ బెర్త్ దక్కాక వాటికి గుడ్‌బై చెప్పారు. తాజాగా తమిళనాడులో పార్టీ ప్రారంభించిన విజయ్ తన 69వ సినిమాతో నటనకు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ఉదాహరణల్ని ఇప్పుడు పవన్ నిర్ణయంతో పోల్చి చూస్తున్నారు కొందరు. సినిమాలు, రాజకీయాల్ని ఏకకాలంలో బ్యాలెన్స్ చేయడం కుదరదన్న ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు పవన్ రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగించగలరా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. రాజకీయాల్లో అవినీతికి తావు లేకుండా, తన వ్యక్తిగత ఖర్చులు, జనసేన నిర్వహణ కోసం సినిమా ఆదాయమే ప్రధాన వనరని పవన్ స్పష్టం క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఇతర నాయకులకు వ్యాపారాలు లేదా ఆస్తులు ఉండవచ్చుగానీ… నాకు తెలిసిన ఏకైక వృత్తి నటనేనని, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవ కొనసాగించేందుకు నటించక తప్పదన్నది ఆయన వాదన.
అయితే… డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రెగ్యులర్ సినిమా షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల ప్రభుత్వ వ్యవహారాల మీద ప్రభావం పడుతుందని విమర్శిస్తున్నాయి విపక్షాలు. డిప్యూటీ సీఎంకు ప్రజల సమస్యలకంటే సినిమాలే ఎక్కువైపోయాయా? దాని వల్ల పొలిటికల్ సీరియస్‌నెస్ తగ్గుతుందన్నది విపక్ష నేతల వాదన. గతంలో అంటే ఆయన ఏం చేసినా నడిచిందిగానీ… ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో సీరియస్‌గా లేకుంటే ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు విపక్ష నాయకులు. అయితే… సినిమాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నా… శాఖలకు సంబంధించిన సమీక్షలు, పర్యటనలను ఎక్కడా ఆపడం లేదని స్పష్టం చేస్తోంది పవన్ టీమ్. ఈ పరిస్థితుల్లో రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కత్తిమీద సామేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సరైన నిర్ణయాలతో తన శాఖల ద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగితే మిగతావన్నీ గాలికి కొట్టుకుపోతాయని, అలా కాకుండా పరిపాలనలో లోపాలు కనిపిస్తూ, వరుసగా సినిమాలు విడుదలవుతుంటే మాత్రం ఆయనకే ఎఫెక్ట్ అన్నది విశ్లేషకుల వార్నింగ్.
