Site icon NTV Telugu

పరిటాల శ్రీరాం ఘాటైన విమర్శలు..!

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్‌ ఉన్నా.. ఆ నియోజకవర్గంలో సీట్‌ ఫైట్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది. అది కూడా ప్రతిపక్ష పార్టీలో…! ప్రత్యేకించి ఆ యువనేత వేస్తున్న పంచ్‌లు.. చేస్తున్న సవాళ్లు పొలిటికల్‌ హీట్‌ రాజుస్తున్నాయట. నియోజకవర్గం తన అడ్డా అని ఆ నాయకుడు చెప్పడం వెనక కారణం ఏంటి?

కేడర్‌ ఒత్తిడితో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌గా పరిటాల శ్రీరామ్‌ పేరు ప్రకటన..!

ధర్మవరం. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మార్మోగుతున్న పేరు. పొలిటికల్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీనికి కారణం.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. అదికూడా ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ఆయన కామెంట్స్‌తో రాజకీయ రచ్చ మొదలైంది. శ్రీరామ్‌ది ధర్మవరం నియోజకవర్గం కాదు. రాప్తాడు పరిధిలో ఉంటారు. ఇక్కడ మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ.. టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిపోయారు. దాదాపు ఏడెనిమిది నెలలుగా ధర్మవరానికి టీడీపీ ఇంఛార్జ్‌ లేరు. ఆ మధ్య చంద్రబాబు జిల్లా టూర్‌కు వచ్చినప్పుడు పరిటాల శ్రీరామ్‌ను ధర్మవరం ఇంఛార్జ్‌గా నియమించాలని కేడర్‌ గొడవ చేసింది. మరికొందరు పార్టీ నాయకులు అధినేత వద్దకు వెళ్లి ఒత్తిడి చేశారట. దాంతో పరిటాల శ్రీరామ్‌ను ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే సూరిపై శ్రీరామ్‌ హాట్‌ కామెంట్స్‌..!
మాజీ ఎమ్మెల్యే సూరికే పార్టీ టికెట్‌ అని ప్రచారం..!

ఇంఛార్జ్‌గా ప్రకటించిన కొత్తలో శ్రీరామ్‌ పెద్దగా యాక్టివ్‌గా లేరు. కొన్నిరోజులుగా ధర్మవరంలో పార్టీపరంగా గట్టి వర్కవుట్‌ చేస్తున్నారట. ఇటీవల టీడీపీ నిర్వహించిన గౌరవ సభల్లో శ్రీరామ్ పాల్గొన్నారు. ఆ సభల్లో శ్రీరామ్ చేస్తున్న కామెంట్స్.. రాజకీయ రగడ రాజేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ పేరు ఎత్తకుండా ఆయనపై పరోక్ష ఆరోపణాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలే స్థానికంగా చర్చగా మారుతున్నాయి. శ్రీరామ్‌ ఘాటైన పదజాలం ఉపయోగించడానికి కారణాలు ఉన్నాయట. సూర్యనారాయణ మళ్లీ టీడీపీలోకి వస్తారని.. ఆయనకే టికెట్ వస్తుందని నియోజకవర్గంలో చర్చ సాగుతోందట. ఇది ధర్మవరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే సూరి, ఇంఛార్జ్‌ శ్రీరామ్ అనుచరుల మధ్య మాటాల యుద్ధానికి తెరతీసింది.

టీడీపీలోకి తిరిగొచ్చే మాజీ ఎమ్మెల్యేకు ఏదో ఒక పదవి ఇస్తామని వెల్లడి..!

మాజీ ఎమ్మెల్యే సూరి.. టీడీపీలో చేరి పార్టీ టికెట్‌ తెచ్చుకుంటే.. తాను అసలు రాజకీయాల్లోనే ఉండబోనని సవాల్‌ చేశారు పరిటాల శ్రీరామ్‌. ఆయన టికెట్‌ తెచ్చుకునేది లేదు.. తాను రాజకీయాలను వీడేది లేదని తెగేసి చెప్పేశారు. ఒకవేళ పార్టీలోకి వస్తే రావచ్చు.. కండువా కప్పేది తానేనని స్పష్టం చేశారట. బాగా కష్టపడితే ఏదో ఒక పదవి ఇస్తానన్నారు శ్రీరామ్‌.

ఇది నా మాటే కాదు.. అధినేత చంద్రబాబుది కూడా అదే మాట అన్నారు. శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో రెండువర్గాలూ కుమ్ములాడుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాత్రం తాను టీడీపీలోకి తిరిగి వస్తున్నానని కానీ.. టికెట్‌ ఆశిస్తున్నానని కానీ ఎక్కడా చెప్పడం లేదు. మొత్తం మీద ఎన్నికలకు ఇంకా రెండన్నరేళ్లు ఉండగానే ధర్మవరం టీడీపీలో టికెట్ వార్ మొదలైంది. శ్రీరామ్ కామెంట్స్ చూస్తుంటే.. ఏదో జరుగుతోంది అన్న చర్చ ఊపందుకుంది. అదేంటో కాలమే చెప్పాలి.

Exit mobile version