ఆ రెండు నియోజకవర్గాలలో అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక MLA పక్క నియోజకవర్గం మీద కన్నేస్తే.. ఆ MLA నియోజకవర్గంపై ఆ పక్కనున్న MLA సోదరుడి కన్నుపడిందట. ఈ ఇద్దరూ చేస్తున్న.. చేసుకుంటున్న ప్రచారం ఒక్కటే. అక్కడ ఆయనైతే కష్టం.. నేను అయితే బెటర్ అని అట. ఇంతకీ ఎవరి ఫార్ములా ఏంటి? ఎవరు ఏం చేస్తున్నారో చూద్దాం..!
రోజులు మారుతున్నాయి.. రాజకీయాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నవారు ఇప్పుడు తమ స్థానానికి గ్యారెంటీ లేదని తెలుసుకుని కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ.. పల్నాడు ప్రాంతంలో వైసీపీ రాజకీయాలు మాత్రం వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ కుండమార్పిడి రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పక్క స్థానానికి మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో కానీ.. అధికారపార్టీ అంచనాలు.. వ్యూహాలు మాత్రం ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ ప్రచారంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్నచోట సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. జిల్లాలోని మరో నియోజకవర్గంలో తన సోదరుడిని బరిలో దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. వాస్తవానికి పిన్నెల్లికి మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ. గురజాల నియోజకవర్గం కూడా తమ కుటుంబానికి కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారట పిన్నెల్లి. తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని గురజాలలో పోటీ చేయించాలనే డిమాండ్ కుటుంబ సభ్యుల నుంచి కూడా రావడంతో పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యారట.
గతంలో కూడా గురజాల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈ ప్రాంతంలో గట్టిగానే తిరిగారు. ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. కార్యకర్తలకు కష్టం వచ్చినా పిన్నెల్లి వస్తారనే టాక్ ఉంది. ఇక్కడ నుంచి సోదరుడిని పోటీ చేయించాలనే వ్యూహంతోనే ఎమ్మెల్యే PRK గురజాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీపై పైచెయ్యి సాధించాలంటే పిన్నెల్లి కుటుంబం మాత్రమే గట్టి పోటీ ఇస్తుందనే చర్చ PRK వైపు నుంచి ఉందట. పిన్నెల్లి బ్రదర్స్ సంగతి అలా ఉంటే.. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా నరసరావుపేటలో పోటీ చేయాలనే కోరిక ఉందట. 2019లో కాసు నరసరావుపేటలోనే పోటీ చేయాలని చూశారు. అది సాధ్యం కాలేదు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే 2019లోనూ ఛాన్స్ ఇచ్చింది పార్టీ.
ప్రస్తుతం మారుతున్న రాజకీయాలతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నరసరావుపే ఎంపీగా పంపుతారని.. లేదా కాసు మహేష్‌రెడ్డిని ఎంపీగా నిలబెడతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఎటు తిరిగి పిన్నెల్లి కుటుంబానికి గురజాలపై కన్ను ఉండటంతో కాసు మహేష్‌రెడ్డి నరసరావుపేట రాజకీయాల్లోకి రావడంతో ఆశ్చర్యం లేదనే వాదన పార్టీలో ఉంది. గురజాలలో జంగా కృష్ణమూర్తితో కాసు వర్గానికి ఉన్న వైరం కొనసాగుతోంది. అందుకే గురజాల నుంచి దూరంగా జరిగితే బెటర్ అనే ఆలోచనలో కాసు వర్గీయుల్లో ఉందట. నరసరావుపేటలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన గోపిరెడ్డిని కాదని అధిష్ఠానం మహేష్‌రెడ్డికి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
