Paderu Politics : మాజీ మంత్రి వనవాసం వీడారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చినట్టేనా? ఆయన కదలికలపై ఎమ్మెల్యే వర్గం కౌంటర్ అటాక్ చేస్తోందా? సోషల్ మీడియా వేదికగా దుమ్ము దుమారం రేపుతోంది ఎవరు? కొత్త సమీకరణాల పర్యవసనాలేంటి? లెట్స్ వాచ్..!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల గోలతో నలిగిపోతోంది. ఇక్కడ రెండు వర్గాలు ఆధిపత్య పోరాటం చేస్తుంటే.. ఇటీవల మరో గ్రూప్ బయలుదేరింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అనుచరుడిగా ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్నారు. ఇటీవల భాగ్యలక్ష్మికి ఏఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది వైసీపీ. అప్పటి వరకు ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అన్న బుల్లిబాబు వర్గం కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపించింది. ఇంతలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తెరపైకి వచ్చారు. దీంతో పాడేరు రాజకీయాలు మరో టర్న్ తీసుకునేలా ఉన్నాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
కొద్దికాలంగా బాలరాజు నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టడం చర్చగా మారింది. మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలను అడ్డుపెట్టుకుని సభలు, సమావేశాల పేరిట హడావిడి చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు పెడితే.. వాటిల్లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఫోటో లేకుండా జాగ్రత్తపడుతోందట బాలరాజు వర్గం. అయితే మాజీ మంత్రి కదలికలను ఓ కంట కనిపెడుతున్న భాగ్యలక్ష్మి.. ఉపేక్షిస్తే ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారట. బాలరాజు లక్ష్యంగా అటాక్ ప్రారంభించారు కూడా. భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే అయిన ఈ మూడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి.. మంత్రిగా ఉన్నప్పుడు బాలరాజు తీసుకుని వచ్చిన ప్రాజెక్టులపై బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. రాజకీయంగా ఒకరి లోతులను ఒకరు తవ్వుకునే ప్రయత్నాలు ప్రారంభించడంతో ఇక్కడ వ్యవహారం ముదురు పాకానపడినట్టే కనిపిస్తోంది.
వాల్మీకి తెగకు చెందిన బాలరాజు 1989లో చింతపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. మావోయిస్టుల చేతిలో కిడ్నాప్ అవ్వడంతో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురవ్వగా 2009లో పాడేరు నుంచి గెలిచి వైఎస్ కేబినెట్లో మంత్రి అయ్యారు బాలరాజు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా అప్పటి వైసీపీ అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి చేతిలో ఓడిపోయారు. 2019ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసినప్పటికీ 6వేల ఓట్లకు మించి రాలేదు. 2020 మార్చిలో వైసీపీ తీర్ధం పుచ్చుకోగా ఆయన కుమార్తెకు జీకేవీధి జడ్పీటీసీగా అవకాశం కల్పించింది పార్టీ. జడ్పీ చైర్మన్ పీఠం ఎస్టీకి రిజర్వ్డ్ కావడంతో బాలరాజు ఫ్యామిలీకి మరోమారు అవకాశం లభించినట్టేనని అంతా భావించారు. ఆఖరి నిమిషంలో అవకాశం చేజారింది. ఆ సమయంలోనే బాలరాజు రాజకీయ భవిష్యత్‌పై హైకమాండ్ భరోసా ఇచ్చిందనే ప్రచారం జరిగింది. దానిని బలపరుస్తూ ఇప్పుడు మాజీ మంత్రి కదలికలు ఉన్నాయని టాక్.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిపై పార్టీలోని వ్యతిరేకవర్గం కూడా కత్తులు దూస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో బాలరాజు వర్గం దూకుడు పెంచడంతో అదే రేంజ్‌లో ఎదురుదాడికి దిగుతోంది భాగ్యలక్ష్మి టీమ్. పాడేరులో వైసీపీలో గ్రూపులు ఉన్నప్పటికీ.. పార్టీ బలంగా ఉంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా 2014,2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. అందుకే టికెటే లక్ష్యంగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పొలికేక పెడుతున్నారట. పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి వైరాన్ని తీసుకెళ్లారు. మరి… పాడేరు వైసీపీలో ఎవరికి పట్టం కడతారో.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
