OTR: పోలవరం క్రెడిట్‌ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సైట్‌కు.!

Otr Bjp

Otr Bjp

OTR: ఏపీ బీజేపీ మైలేజ్‌ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? పోలవరం ప్రాజెక్ట్‌ను కాషాయవరంగా మార్చుకోవాలనుకుంటోందా? ప్రాజెక్ట్‌ నిర్మాణం కొలిక్కి వస్తున్న దశలో ఆ పార్టీ లీడర్స్‌ స్వరం సవరించుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి మైక్‌ల ముందు చెప్పడం అందులో భాగమేమా? పోలవరం మైలేజ్‌ విషయంలో కాషాయ వ్యూహం ఎలా ఉంది? చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి నీళ్ళివ్వాలన్న పట్టుదలగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదంతా ఒక ఎత్తయితే… సరిగ్గా ప్రాజెక్ట్‌ పనుల వేగవంతం, కాలువలకు నీళ్ళ అంశం దగ్గరే కూటమి పార్టీల మధ్య క్రెడిట్‌ రేస్‌ మొదలైందా అన్న డౌట్స్‌ తాజాగా వస్తున్నాయి రాజకీయవర్గాల్లో. బీజేపీ తాజా వైఖరే ఈ అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి ఏపీ బీజేపీ ముఖ్యులంతా భారీ ర్యాలీగా పోలవరం సందర్శనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని గుర్తించిన బీజేపీ రాష్ట్రంలో తన ప్రతిష్ట పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ప్రాజెక్ట్ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పనులు పరుగులు పెడుతున్నాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు పోలవరం ప్రాజెక్ట్‌తో తమది దశాబ్దాల ఎమోషనల్‌ బాండింగ్‌ అని స్టేట్‌ కాషాయ దళం చెబుతోందట. భారతీయ జన్‌సంఘ్‌ కాలం నుంచే పోలవరం కోసం ఉద్యమాలు చేశామని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్‌.

పోలవరం కోసం పాదయాత్రలు నిర్వహించిన చరిత్ర బీజేపీదని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చామని చెబుతున్నారు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌ని చేర్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందంటూ గుర్తు చేస్తున్నారు. దీన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అంటూ.. ముంపు మండలాల విలీనానికి బీజేపీ జాతీయ నాయకత్వం కృషి చేసిందంటూ.. గతంలోకి వెళ్తున్నారు ఏపీ కాషాయ నాయకులు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లామని, చంద్రబాబు ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యత అప్పగించి కేంద్రం నిధులు ఇచ్చిందంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ లీడర్స్‌.

అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, బీజేపీ ఇలా ఒంటరిగా పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీజేపీ నేతల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం 20వేల750 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అలాగే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీసిందని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు చొరవతో పనులు పరుగులు పెడుతున్నాయని, 80 శాతానికి పైగా పూర్తయ్యాయని చెబుతున్నారు. త్వరలో కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయంటే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషేనన్నది కమలం వెర్షన్‌.

అలాగే పోలవరం పరిసరాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే అవకాశాలపైనా బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోందట. ప్రకృతి అందాలు, దేవాలయాలు, జలాశయాలను అనుసంధానం చేస్తూ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదిస్తోంది. వీటన్నిటినీ చూస్తుంటే… ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ కోసం కాషాయ దళం గట్టిగానే ప్రయత్నిస్తోందని, అదే సమయంలో సీఎం చంద్రబాబుతో తేడాలు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు కనవిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిర్మాణం కొలిక్కి వస్తున్న టైంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై ఇప్పటికీ నోరు తెరవకుంటే పొలిటికల్‌ మైలేజ్‌లో వెనుకబడిపోతామని బీజేపీ లీడర్స్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిగా ఉన్నాసరే.. అందులో మనమేంటి అన్నది ముఖ్యం అంటున్నారు ఏపీ కాషాయ లీడర్స్‌. ప్రస్తుత ప్రాజెక్ట్‌ పర్యటన కూడా ఉనికి చాటుకునే ప్రయత్నమే అయి ఉండవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.