OTR : వైసీపీ మాజీ మంత్రులు భయపడుతున్నారు..? మౌనం ఎందుకు..?

Ycp

Ycp

ఆ మాజీ మంత్రులు భయపడుతున్నారా? లేక తమదైన శైలిలో వేరే లెక్కలేవో వేసుకుంటున్నారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వద్దన్నా మాట్లాడిన నేతలకు…. ఇప్పుడు రండి మాట్లాడండని అంటున్నా ఎందుకు గొంతు పెగలడం లేదు? జగన్‌ కేబినెట్‌లో పనిచేసిన నలుగురైదుగురు మినహా మిగతా మాజీ మంత్రుల మౌనానికి అర్ధం ఏంటి? వాళ్ళది వ్యూహమా? భయమా? 2024 ఘోర ఓటమి నుంచి కోలుకున్న వైసీపీ… ప్రతిపక్ష పాత్రను సమర్ధంగా పోషించే దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ఒక్కో అంశాన్ని తీసుకుని పార్టీ అధినేత జగన్ వరుసగా స్పందిస్తున్నారు. దాదాపు ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారాయన. అదే సమయంలో అంతే దూకుడుగా అంది పుచ్చుకోవాల్సిన మాజీ మంత్రులు ఆ స్థాయిలో రియాక్ట్‌ అవడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. వాళ్ళలో కొందరే స్పందిస్తుండగా…ఎక్కువ మంది చూద్దాం.. చేద్దాం అమ్మ ధోరణితోనే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కాకాణి గోవ‌ర్ధన్‌ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ వంటి కొందరు తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, కురసాల కన్నబాబు, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్కే రోజా, విడదల రజని లాంటి వాళ్ళ అప్పుడప్పుడు సందర్భానుసారం మాట్లాడుతూ… మేం ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన ధర్మాన బ్రదర్స్, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర వంటి వారు సైలెంట్ అయిపోయారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ యాక్టివ్‌గా లేరన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అటు కృష్ణా జిల్లాకు చెందిన వ‌ల్లభ‌నేని వంశీ, కొడాలి నాని, ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూల‌పు సురేష్, నెల్లూరు నేత అనిల్ కుమార్ యాద‌వ్, రాయలసీమ లీడర్స్‌ శంకర్ నారాయణ, ఉషశ్రీచరణ్, నారాయణ స్వామి, అంజద్ భాషా వంటి మాజీలు పార్టీ కార్యక్రమాల‌కు హాజ‌ర‌వుతున్నారు త‌ప్ప ప్రభుత్వ వైఫల్యాలపై నోరు మెదపడంలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రతి అంశంపై మాట్లాడిన నాయకులు… ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండటంపై క్యాడర్‌లో అసంతృప్తి పెరుగుతోందట. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు… ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి దక్షిణ కోస్తా వరకు… వివిధ శాఖలు నిర్వహించిన పలువురు మాజీ మంత్రులు ఇప్పుడు పొలిటికల్‌ లో ప్రొఫైల్‌లో ఉన్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కౌంటర్ ఇవ్వడంలో, పార్టీ వాదనను బలంగా వినిపించడంలో… చాలామంది వెనకబడుతున్నారన్నది ఇంటర్నల్‌ వాయిస్‌. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గతంలో ఆయా శాఖలను నిర్వహించిన మాజీ మంత్రులు స్పందిస్తే పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారట అధిష్టానం పెద్దలు. అదే సమయంలో వాళ్ళ లెక్కలు వేరుగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు, విచారణలు వరుసగా రావడం.. కొందరు మాజీ మంత్రులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి చూసిన మిగిలిన వారు ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉండడమే బెటరని భావించినట్టు చెప్పుకుంటున్నారు.

గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా కొందరిలో ఉన్నట్టు సమాచారం. దీంతో అవసరమైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తూ, వినిపిస్తున్న వాళ్ళే ఎక్కువ ఉంటున్నారన్నది ఫ్యాన్‌ వర్గాల వాయిస్‌. అయితే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరు మాత్రం ఇది కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో వివిధ శాఖలను నిర్వహించిన మాజీ మంత్రులు ఆయా అంశాలపై స్పందిస్తే పార్టీ వాదన మరింత బలంగా ప్రజల్లోకి వెళుతుందన్నది పెద్దల అభిప్రాయం అట. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం పోటీ పడ్డ నాయకులు… ఇప్పుడు కూడా అదే స్థాయిలో బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు. ప్రత్యేకించి శాంతిభద్రతల అంశంలో ఈ చర్చఎక్కువగా ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్‌. పోలీసు వ్యవస్థ పనితీరును కూడా విమర్శిస్తున్నారు. అలాంటి సమయంలో మాజీ హోం మంత్రులు స్పందిస్తే పార్టీ వాదనకు బలం చేకూరుతుందని భావిస్తున్నారు కార్యకర్తలు. ఆ శాఖను నిర్వహించిన తానేటి వ‌నిత‌, సుచ‌రిత‌లు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని కోరుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్‌లో కనిపించిన చాలామంది మాజీ మంత్రులు… ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కామ్‌ అయిపోయారని, ఇప్పటికీ రీచార్జ్ కాలేదనే మాట వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో వాళ్లంతా పార్టీ పిలిస్తే వస్తాం… చెబితే మాట్లాడతాం అన్న ధోరణిలో ఉన్నారా.. లేక సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళ విషయంలో జగన్‌ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది.