అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాసిన్ని ఓట్ల రూపంలో మొలకలు వచ్చాయి. పార్లమెంట్ పోరులో ఏకంగా కమలం వికసించింది. కానీ అంతలోనే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంఛార్జీ మేడమ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఎఫెక్ట్ మున్సిపోల్స్‌లో స్పష్టంగా కనపడింది. కథే మారిందనుకున్న కమలంలో కలహాలు చివరికి దాడులకు దారి తీశాయి. ఇంతకీ కాషాయ పార్టీకి కషాయంలా మారిన ఆ నియోజకవర్గం కథేంటి? జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది. ఓట్ల పురోగతిని చూస్తే తమకు మంచిరోజులు వచ్చాయని సంబరపడ్డారు లోకల్ కమలనాథులు. అయితే నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగ శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం..అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకుని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాస్త కష్టపడితే మున్ముందు పార్టీకి మంచి రోజులు వస్తాయని క్యాడర్ భావించింది. అయితే, ఏం జరిగిందో ఏమోకానీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగ శ్రావణి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం క్రమంగా తగ్గించేశారు. నేతలకు అందుబాటులో ఉండకుండా, ఒకవేళ కలిసినా ఎడమొఖం పెడమొహం అన్నట్టుగా ఉంటున్నారట శ్రావణి. రెండేళ్లుగా ఇలా టచ్ మీ నాట్ అన్నట్టు సాగిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లు జగిత్యాలోనే నివాసం ఉన్న శ్రావణి సడన్‌గా ఇక్కడ నుంచి హైదరాబాద్ మార్చడంతో ఏం జరుగుతుందో క్యాడర్‌కు అంతుపట్టడం లేదట. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ ఇంచార్జీ హోదాలో జగిత్యాలకి తిరిగి వచ్చారు శ్రావణి.
మున్సిపల్ టికెట్ల పంపిణీలో ఎంపీ అరవింద్ శ్రావణికే పవర్స్ ఇవ్వడంతో, పాత బీజేపీ నేతలకు, ఇంచార్జీ శ్రావణి గొడవలు తారాస్థాయికి చేరినట్టయింది. శ్రావణి వ్యవహార శైలిపై అప్పట్లో పార్టీ పెద్దలకు ఫోన్లో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఎన్నికల ఫలితాల తర్వాత జగిత్యాల మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లను సాధించింది బీజేపీ. నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ రాయికల్ లో అయితే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ లను వెనక్కి నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. పార్టీ సరిగ్గా దృష్టిపెడితే జగిత్యాలలో కనీసం 15కి పైగా స్థానాలు సాధించేది అని సీనియర్లు అంటున్నారు. అటు రాయికల్ లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికి బీఆర్ఎస్‌తో కుమ్మక్కు కావడంతో చైర్మన్ పీఠం దక్కలేదని ఇక్కడి లీడర్లు రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇంచార్జ్ వైఖరి, ఎంపి అరవింద్ తీరుతో బీజేపీ నష్టపోతోందని ఆ లేఖలో చెప్పారట. అంతటితో ఆగకుండా ఇటీవల ఎంపీ అరవింద్ జగిత్యాల పర్యటనకు రాగా అదే సమయంలో శ్రావణి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో బీజేపీలోని విబేధాలు రచ్చకెక్కినట్టయింది.
జగిత్యాలలో గ్రూప్ వార్ కి పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఒక్కటే కారణం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంచార్జీ శ్రావణి టికెట్లు అమ్ముకున్నారని.. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్ గోలమాల్ చేసారనే ప్రచారం సొంత పార్టీ నేతలే చేస్తుండటంతో ఆర్థిక అంశాలు కూడా కారణం అనే చర్చ కూడా సాగుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ ఇళ్లపై దాడుల వరకు వెళ్లిన గ్రూప్ వార్ కి చెక్ పెట్టకపోతే జగిత్యాలలో కమల వికాసం కష్టమే అంటున్నారు కార్యకర్తలు.
