Site icon NTV Telugu

Off The Record : కొత్త జిల్లా వెనక టీడిపి మాస్టర్ ప్లాన్..?? వైసీపీ కంచుకోటల్లో టీడిపి పాగా..??

Tdp

Tdp

కూటమి ప్రభుత్వం కొత్త కేలిక్యులేషన్స్‌లో ఉందా? జిల్లాల పునర్విభజనతో పాత లెక్కల్ని సరిచేయాలనుకుంటోందా? వైసీపీ కంచుకోటల్లో టీడీపీ పాగా వేసే ప్రయత్నం కూడా జరుగుతోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను ఎక్కడ అమలు చేస్తోంది? ఆ కొత్త జిల్లా ఏర్పాటు క్రెడిట్‌ తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశం ఉందా? లెట్స్‌ వాచ్‌. ప్రకాశంలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రాంత ప్రజ‌ల సెంటిమెంట్‌ను గమనించి అంత‌ర్లీనంగా టీడీపీ పెద్ద స్కెచ్చే వేసినట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు క‌ర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మార్కాపురం ఏరియా… 1970 పునర్విభజన టైంలో ప్రకాశం జిల్లాలో కలిసింది. రాయలసీమ నుంచి వేరుపడిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రం ఒంగోలుకు దూరంగా ఉండటం పెద్ద మైనస్‌కాగా… అభివృద్ధిలో కూడా వెనుకబడ్డామన్న భావన స్థానికంగా ఉంది. దీంతో ఐదు ద‌శాబ్దాలుగా ప్రత్యేక జిల్లా డిమాండ్‌ అలాగే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అది నెరవేరింది.

 

మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి అసెంబ్లీ సెగ్మెంట్స్‌తో కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో కూడా ఈ జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా …పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదనకే కట్టుబడి ఉండటంతో మార్కాపురం జిల్లా సాధ్యపడలేదు. సరిగ్గా ఇక్కడే టీడీపీ పెద్దలు సరికొత్త ఆయుధానికి పదును పెట్టారన్న విశ్లేషణలున్నాయి. రకరకాల కారణాలతో ప్రకాశం జిల్లా ప‌శ్చిమ ప్రాంతంపై వైసీపీ ఆధిపత్యం కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌తంలో కాంగ్రెస్, ఆ త‌ర్వాత వైసీపీకి మార్కాపురం, ఎర్రగొండ‌పాలెం, గిద్దలూరు, క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌లుగా మారిపోయాయి. ఈ క్రమంలో… గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారానికి వచ్చిన అప్పటి విపక్షనేత చంద్రబాబు వ్యూహాత్మకంగా మార్కాపురం జిల్లా కార్డును గట్టిగా వాడారు.

అది వర్కౌట్‌ అయిందా అన్నట్టు… ఎర్రగొండ‌పాలెం మిన‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో… ఎన్నికల హామీ మేర‌కు ఈ ప్రాంతీయుల మనోభీష్టానికి అనుగుణంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆ మేరకు మార్కాపురం కేంద్రంగా పాల‌న కూడా మొద‌లైంది. ఇక ఈ ప్రాంతంలో ప్రస్తుతం టీడీపీ గెల్చుకున్న మూడు నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోట‌లు కావడంతో… వాటిని బద్దలు కొట్టేందుకు కొత్త జిల్లాను గట్టిగా వాడుకోవాలని టీడీపీ పెద్దలు డిసైడైనట్టు తెలుస్తోంది. త‌మ పార్టీకి క‌లిసివ‌చ్చే ప్రధాన అస్త్రమైన వెలిగొండ ప్రాజెక్టుకు ఈ టర్మ్‌లోనే రిబ్బన్‌ కత్తిరించి చేసి క్లెయిమ్‌ చేసుకోవాలనుకుంటున్నారట. మార్కాపురం, గిద్దలూరు, క‌నిగిరి, ఎర్రగొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి సహజ అనవుకూలతలు ఉండే రెడ్డి సామాజికవర్గం డామినేషన్‌ ఉంటుంది. అందుకే… గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా మార్కాపురంలో కందుల నారాయ‌ణ‌రెడ్డి, గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి, క‌నిగిరిలో ముక్కు ఉగ్రన‌ర‌సింహారెడ్డికి టిక్కెట్లు ఇచ్చి ఆ సామాజికవర్గ ఓట్లను అనుకూలంగా మార్చుకోగలిగిందన్న లెక్కలున్నాయి.

 

మార్కాపురంలో అయితే… 2004 త‌ర్వాత తొలిసారి టీడీపీ గెలిచింది. ఈ క్రమంలో ఓవైపు ప్రత్యేక జిల్లా హామీని నిలబెట్టుకున్నామని చెబుతూ, మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజ‌ల్లో పాజిటివ్ వైబ్‌ తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారట టీడీపీ పెద్దలు. వేడి తగ్గకుండా, వీలైనంత ఎక్కువగా ఈ అంశాల మీద చర్చలు పెట్టి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పొలిటికల్‌ మైలేజ్‌ పొందాలనుకుంటున్నారట టీడీపీ లీడర్స్‌. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం డామినేషన్‌ ఉండే నియోజకవర్గాల్లో పట్టు సాధించగలిగితే… ఇక తిరుగుండబోదని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే… ఈ నాలుగు నియోజకవర్గాల్లో పట్టు బిగిస్తే… అది ఒంగోలు లోక్‌సభ సీటుకు కూడా ప్లస్‌ అవుతుందన్న లెక్కలున్నాయి. ఆ విధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్‌లో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎంతవరకు వర్కౌట్‌ అవుతుంది? వైసీపీ కౌంటర్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోందన్నది చూడాలి.

 

Exit mobile version