Site icon NTV Telugu

Off The Record : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో కొన్ని వికెట్స్‌ పడిపోతాయా..?

Otr Tdp

Otr Tdp

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో కొన్ని వికెట్స్‌ పడిపోతాయా? మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోందా? ఎవరెవర్ని తప్పించాలన్న విషయంలో సీఎం చంద్రబాబు క్లారిటీకి వచ్చారా? పునర్‌ వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా… ఒక ఐదారుగురికి మాత్రం ఉద్వాసన తప్పదా? ఏ ప్రాతిపదికన వాళ్ళని తప్పించే అవకాశం ఉంది? అసలా హిట్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల తీరుపై సీరియస్‌ అయ్యారు సీఎం చంద్రబాబు. అయితే… అవనీయండి…. అందులో కొత్తేముంది? మంత్రుల మీద ఆయన కోప్పడటం, మారేవాళ్ళు మారడం, లైట్‌ తీసుకునే వాళ్ళు తీసుకోవడం కామనేకదా….? ఇప్పుడు ఆయన కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? ఆగండాగండి…. అక్కడే మీరొక చిన్న పాయింట్‌ని కరెక్ట్‌ చేసుకోవాలని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. చంద్రబాబు పాత కోపం వేరు, ఇప్పుడాయన చెప్పిన తీరు వేరుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఆయన లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ మారిపోయాయట. సీఎం స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, హెచ్చరికల తీవ్రత కూడా వేరుగా ఉందని చెప్పుకుంటున్నారు. అవసరమైతే… కొత్త మంత్రులు వస్తారనేదాకా…. పరిస్థితి వెళ్ళిందంటే…. కేబినెట్‌ సహచరుల విషయంలో ఈపాటికే ఆయనో క్లారిటీకి వచ్చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. నాలో మళ్ళీ 95 సీఎంని చూస్తారని గతంలో ఒకటి రెండు సార్లు అన్నా… ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి మాటల్ని చూస్తుంటే…. పాత చంద్రబాబు బయటికి వచ్చేట్టే కనిపిస్తున్నాడన్న చర్చ మొదలైంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

దీంతో… ఒకవేళ ఆయన సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటే… మంత్రులు ఎవరెవరి కుర్చీల కింద బాంబులు పేలతాయంటూ కూడికలు, తీసివేతల్లో బిజీగా ఉన్నారట టీడీపీ నాయకులు. ముఖ్యంగా… ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు మంత్రుల విషయంలో…. సీఎం బాగా సీరియస్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ పేర్లు వస్తేనే… ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది సీఎంవో వర్గాల సమాచారం. అందుకు అవినీతి వ్యవహారాలు, ఇతర కారణాలు ఒక ఎత్తయితే…. వాటన్నిటికీ మించి వైసీపీపై స్పందన విషయంలో మంత్రుల తీరు ఏమాత్రం బాగా లేదన్నది ఇంటర్నల్‌ టాక్‌ అట. ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా…వాళ్ళని కౌంటర్‌ చేయడంలో చూసీ చూడనట్టుగా ఉన్నారని, ఇలా అయితే కష్టం అంటూ సీఎం వాళ్ళకు క్లాస్‌ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ళ శాఖల పనితీరుపై కూడా సీఎం సంతృప్తిగా లేరని, ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నారని మాట్లాడుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. మిగతా మరి కొందరు మినిస్టర్స్‌ విషయంలో కూడా ముఖ్యమంత్రి బాగా అసహనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. ఎమ్మెల్సీ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో స్వయంగా చెప్పారు చంద్రబాబు. ఆ క్రమంలో ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి… కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం ద్వారా పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. జనసేన నుంచి నాగబాబుతో పాటు బీజేపీ తరపున మరొకరికి ఛాన్స్‌ ఉండవచ్చంటున్నారు. మిగతా వాళ్ళ విషయంలో లాస్ట్‌ మినిట్‌ మార్పులు చేర్పులు ఎలా ఉన్నా… ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్‌ మంత్రిని మాత్రం ఖచ్చితంగా తప్పించేస్తారని చెప్పుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. అలాగే… రాయలసీమకు చెందిన మరో మంత్రికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదికలు తెప్పించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. సదరు మంత్రి ఎక్కడికక్కడ ఏజెంట్స్‌ని పెట్టుకుని కలెక్షన్స్‌లో బాగా బిజీ అయ్యారట. ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖ నిర్వహిస్తున్న ఆయనకు సంబంధించి సీఎం దగ్గర చాలా వరస్ట్‌ రిపోర్ట్‌ ఉందట.

కానీ… తొందరపడకుండా టైం కోసం చూస్తున్నట్టు సమాచారం. అటు వైసీపీ నేతలతో కూడా ఆ ఫస్ట్‌టైం మినిస్టర్‌ బాగా సన్నిహితంగా ఉంటూ… రాసుకుపూసుకు తిరుగుతున్నారన్న నివేదికలు సీఎంవోలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక.. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మంత్రి అయిన మరో నేత తీరు మీద కూడా పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నాయట. ఆయన సారధ్యం సరిగా లేదని, తమకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని మంత్రి మీద పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నట్టు నిఘా నివేదికలు అందాయట. గోదావరి జిల్లాలకు చెందిన ఓ కొత్త మంత్రి పై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కూడా హిట్‌లిస్ట్‌లో ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. కాగా… వీళ్ళని తప్పిస్తే…సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన చంద్రబాబు మరి కొంతకాలం వేచి చూస్తారా? లేక వెంటనే యాక్షన్‌లోకి దిగుతారా అన్న విషయంలో రకరకాల విశ్లేషణలున్నాయి. మొత్తం మీద ఒక ఆరుగురి విషయంలో తీవ్ర అసంతృప్తి, మరో ఆరుగురి మీద ఒక మాదిరి అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. వైసీపీకి సరైన కౌంటర్స్‌ ఇవ్వడం..చేసింది చెప్పుకోవడంలో సదరు మంత్రులు ఫెయిల్ అన్న అభిప్రాయం ఉందట ముఖ్యమంత్రికి. ఈ ముద్ర నుంచి కొందరు తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టినా… మరికొందరికి మాత్రం ఆ ఛాన్స్‌ కూడా ఉండకపోవచ్చన్నని అంటున్నారు. సీఎం ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కాబట్టి… ఇక మాటల్లేవ్‌….. మాట్లాడుకోవడాల్లేవ్‌ అని అంటారన్నదే రాజకీయ పండితుల అభిప్రాయం. దీంతో మార్పులు ఎప్పుడు? ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version