OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?

Medigadda

Medigadda

ఏం జరుగుతోంది….? అసలు ఏమవుతోంది….? అవన్నీ… యాదృచ్ఛికమా? లేక పక్కా స్కెచ్‌తో జరుగుతున్న కుట్రలా? అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఫైళ్ళు ఎందుకు దగ్ధం అయిపోతున్నాయి? అవి ఉన్న చోటే అగ్నిప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? హైదరాబాద్‌ FSL, మేడిగడ్డ ఎల్‌ అండ్‌ టీ ఆఫీసుల్లోని అగ్ని ప్రమాదాల్ని ఎలా చూడాలి? ఈ మంటల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయా? షార్ట్‌ సర్క్యూట్లా..? లేక షార్ట్‌కట్‌ మెథడ్సా? లెట్స్‌వాచ్‌. సంచలనం సృష్టించిన కేసుల దర్యాప్తులో గుండెకాయ లాంటిది ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ. అందులోనూ… హైదరాబాద్‌ FSLకు చాలా మంచి పేరుంది. ఎన్నో క్రైమ్ మిస్టరీలను ఛేదించే అత్యంత కీలకమైన ఆధారాలు, అంతకు మించి గతంలో రాష్ట్రంలో టెర్రరిస్ట్‌ కార్యకలాపాలు, కదలికలకు సంబంధించిన సమాచారం ఉండే చోట ఆమధ్య హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ముఖ్యమైన ఫైళ్లు, డిజిటల్ ఆధారాలతో కాలి బూడిదయ్యాయనే ప్రచారం కలకలం రేపుతోంది. కట్టుదిట్టంగా ఉండే ఆఫీస్‌లో అలా ఎలా జరిగింది? అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారన్న చర్చ నడుస్తుండగానే… తాజాగా జరిగిన మరో ఫైర్‌ యాక్సిడెంట్‌ కలకలం రేపుతోంది. FSL సెగ ఆరకముందే… ఇప్పుడు మేడిగడ్డ బరాజ్‌ నిర్మించిన ఎల్‌అండ్‌టీ ఆఫీసులో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామక్రమంపైనే ఇప్పుడు అందరిలోనూ రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు చెప్పిన అధికారిక వెర్షన్‌ విని నిజమే కాబోలని చాలా మంది అనుకున్నారు. కానీ… నెలల వ్యవధిలోనే…ఎల్‌ అండ్‌ టీ ఆఫీస్‌లో మేడిగడ్డ ఫైళ్లు దగ్ధం అయిపోవడంతో…. ఎక్కడో… తేడా కొడుతోంది, ఏదో జరిగిపోతోందన్న డౌట్స్‌ పెరుగుతున్నాయి వివిధ వర్గాల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు దీనిపై విచారణ వేగవంతం చేసిన తరుణంలోనే… సరిగ్గా మేడిగడ్డ ఫైళ్లు ఉన్న చోటే మంటలు అంటుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.

ఈ రెండిటినీ కేవలం ప్రమాదాలేనని కొట్టిపారేయలేమని అంటున్నారు నిపుణులు. ఇవి ఎలక్ర్టిక్‌ షార్ట్‌ సర్క్యూట్లా లేక సాక్ష్యాధారాల షార్ట్‌కట్‌ దహనాలా అన్నది వాళ్ళ అనుమానం. ఒక కోణంలో చూస్తే… విచారణ సంస్థలకు దొరకకూడని ‘నిజాలు’ ఈ మంటల్లో కలిసిపోయాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోణంలో… సాంకేతిక లోపాలే కారణమైతే, సరిగ్గా ఈ కీలక ఫైళ్లు ఉన్న సెక్షన్లకే మంటలు ఎలా వ్యాపించాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో… ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. గత ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు రాత్రికి రాత్రే ఎల్‌ అండ్‌ టీలో ఫైళ్లను తగులబెట్టే స్క్రిప్ట్ నడిచిందని అధికార పక్షం ఆరోపిస్తుంటే… విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారంటూ ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాదాన్ని ఆయుధంగా వాడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇప్పటి ముఖ్య నేతలకు సంబంధించిన కేసుల ఆధారాలు చెపిపేసేందుకు ఎఫ్ఎస్‌ఎల్‌లో ప్రమాదం పేరుతో ఫైళ్ళ దహనం జరిగిందన్నది గులాబీ నేతల ఆరోపణ. అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా చెప్తున్నారు. కానీ… ఈ డీప్ మిస్టరీని ఛేదించడం అంత తేలిగ్గా కనిపించడం లేదన్నది నిపుణుల మాట. సరిగ్గా ఇక్కడే కొన్ని కొత్త ప్రాధమిక అనుమానాలు వస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్న టైంలో… ఇంకా ఫైళ్లు తగలబడిపోతే ఆధారాలు దొరకవని అనుకోవడం ఏంటనేది బిగ్‌ క్వశ్చన్‌. ఈ రెండు ప్రమాదాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించకపోతే… ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమేనని నమ్మక తప్పదన్న అభిప్రాయం పెరుగుతోంది. మరి ఈ ‘మంటల వెనుక ఉన్న అసలు మనుషులు బయటికి వస్తారా? లేక ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయే మరో మిస్టరీగా మిగిలిపోతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.