నిన్న మొన్నటి వరకు తమ్ముడే నా రాజకీయ వారసుడని ప్రకటించిన ఆ టీడీపీ ఎమ్మెల్యే…. సడన్‌గా నిర్ణయం మార్చుకున్నారా? ఉన్నట్టుండి కుమార్తెను ఎందుకు రంగంలోకి దింపారు? వారసత్వ నిర్ణయం మారిందా…? లేక అంతకు మించిన వేరే వ్యూహం ఉందా? రాజకీయ పరిణామాల్ని ముందే పసిగడతారని పేరున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? తన దగ్గరున్న స్పెషల్ స్ట్రాటజీ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు వ్యవహారం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎవరి రాజకీయం ఎలా మారుతుందో, ఏం నిర్ణయం తీసుకుంటారో ఊహించలేక తలపండిన పొలిటికల్ పండిట్స్ సైతం బుర్ర గోక్కుంటుంటారు. ఏ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో… సింహపురి లీడర్స్‌కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదన్న అభిప్రాయం సైతం ఉంది. ఈ క్రమంలో…. ఇప్పుడు మేటర్ మొత్తం నెల్లూరు రూరల్ సెగ్మెంట్ చుట్టూ తిరుగుతోంది. లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న కూతురు సాయి వైష్ణవి పొలిటికల్ రీ ఎంట్రీనే అందుకు కారణం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వైష్ణవి సడన్‌గా యాక్టివ్ అయిపోవడం గురించి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడోసారి విజయం సాధించారు. అయితే… వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారాయన. అందుకు తగ్గట్టుగానే తమ్ముడిని జనాల్లోకి పంపిస్తూ….. అతని రాజకీయం స్టార్ట్ అయిందని ఇండికేషన్ ఇచ్చేశారు. తనకు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు శ్రీధర్‌రెడ్డి. ఇక ఈసారి రూరల్‌కి టీడీపీ అభ్యర్థి గిరిధర్ రెడ్డే అనుకుంటున్న సమయంలో… సడన్‌గా ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది. తన చిన్న కూతురు సాయి వైష్ణవితో ప్రెస్‌మీట్ పెట్టించారు శ్రీధర్‌రెడ్డి. దీంతో వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి ఆమె పోటీ చేస్తారా అన్న సందేహాలు క్యాడర్‌లో మొదలయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదని, ప్రస్తుతం ఉన్నది జస్ట్ కామా మాత్రమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది.
ఒకవేళ పునర్విభజన జరిగితే… జిల్లాలో మరో ఐదు కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే…మహిళా రిజర్వేషన్ కోటాలో కూడా ఐదు సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ క్రమంలో… నెల్లూరు రూరల్‌ను మహిళలకు కేటాయిస్తారన్న లెక్కలు సైతం ఉన్నాయి. సహజంగానే… రాజకీయ మార్పుల్ని ముందే పసిగట్టగలిగే శ్రీధర్‌రెడ్డి… ఈ విషయం తన నిర్ణయాన్ని మార్చుకున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి కేడర్‌లో. తమ్ముడే తన రాజకీయ వారసుడని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే.. ఒకవేళ నియోజకవర్గం మహిళా కోటాలోకి వెళ్తే… అవకాశం చేజారకుండా కూతురి కోసం ముందుగానే కర్చీఫ్ వేశారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కుమార్తెలకు నియోజకవర్గం బాగా పరిచయం ఉంది. ఆయన పోటీ చేసిన మూడు సార్లు వాళ్ళు నియోజకవర్గమంతా పర్యటించి తండ్రి కోసం ప్రచారం చేశారు. మనం బరిలో లేకున్నా.. అధికారం మన దగ్గర నుంచి చేజారి పోకూడదనే ఉద్దేశ్యంలో ఉన్నారట ఎమ్మెల్యే. కుదిరితే తమ్ముడు లేదంటే కూతురు అన్నట్లుగా చిన్న అమ్మాయిని కూడా తెర మీదకు తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు లోకల్‌గా. ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే కూడా ఇదే సమాధానం ఇస్తున్నారట. అయితే మరో ఆసక్తికరమైన చర్చ కూడా కోటంరెడ్డి కేంద్రంగా జరుగుతోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మేయర్ స్థానాన్ని ఈసారి OC మహిళకు కేటాయిస్తారన్న ప్రచారం ఉంది.. దీంతో తన కుమార్తెను మేయర్‌ను చెయ్యాలనే ఆలోచనలో భాగంగానే ఆయన రంగంలోకి దింపారన్నది ఇంకొందరి అంచనా. కుదిరితే ఎమ్మెల్యే, కాదంటే మేయర్ అన్న లెక్కలో కోటం రెడ్డి ఉన్నారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఒకవేళ నెల్లూరు మేయర్ పీఠాన్ని ఓసీ మహిళకు కేటాయిస్తే ఆ స్థాయి నేతలు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో లేరట. అందుకే ఆ స్థానాన్ని తన కూతురితో భర్తీ చేయించాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం కాస్త డిఫరెంట్‌గానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
