OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?

Bonda

Bonda

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నారా? ఒకే ఉమ్మడి జిల్లా నుంచి ఒకరి తర్వాత ఒకరుగా వివాదాస్పదం కావడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారా? పార్టీ లైన్‌ దాటడం లేదంటూనే ఏదో ఒక రచ్చ పెట్టడంపై పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? పార్టీకి హెడేక్‌ తెప్పిస్తున్న ఆ ముగ్గురు ఎవరు? ఆ తలనొప్పికి టీడీపీ పెద్దలు ఏ బామ్‌ రాయబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు అధినాయకత్వానికి నిత్యం తలనొప్పులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… ఈ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎక్కువ సీట్లు టీడీపీకే దక్కుతున్నాయి. 2024లో కూడా హిస్టరీ రిపీట్‌ అయినా…. గతంలోకంటే మెరుగైన ఫలితాలే వచ్చినా… ఇంటర్నల్‌ వ్యవహారాలు మాత్రం బాగా తేడాగా ఉన్నాయి. ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే వరుసగా పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించడం, ఒకరికి ముగ్గురు తయారవడం చూస్తుంటే…. ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు పరిశీలకులు. దీనికి మొదటగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పునాది వేశారు.

ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా బోండా ఉమా వ్యవహారం వాళ్ళిద్దరికంటే ఎక్కువగా అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో… ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై జిల్లా టీడీపీ వర్గాల్లో గట్టి చర్చలే జరుగుతున్నాయి. తిరువూరు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కొలికపూడి…..గెలిచినప్పటి నుంచే తన వ్యవహారాలతో పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉన్నారన్నది టీడీపీ కేడర్‌ మాట. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో గ్యాప్ రావడం దగ్గర మొదలైన కొలికపూడి ఎపిసోడ్‌… చివరికి అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళిందన్నది పార్టీ వర్గాల మాట. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను తప్పుపట్టడంతోపాటు చివరికి ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇబ్బందికరంగా మారుతోందట. టీడీపీ ఎమ్మెల్యే కాక్రోచ్‌ పార్టీని సమర్థించడం ద్వారా కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా విమర్శించారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు.

ఇప్పటికి రెండుసార్లు కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచి హెచ్చరించింది. దీంతో ఆయన వ్యవహారం సద్దుమణిగిందని అనుకుంటుండగా… గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసే క్రమంలో సొంత పార్టీ మీద కూడా విమర్శలు చేయడం మింగుడుపడని వ్యవహారంగా మారిందట. వంశీ అనుచరుడు కడియాల సతీష్‌కు 8 కోట్ల చెక్కును సీఎం ప్రమాణస్వీకారం సందర్భంగా ఇచ్చారని, గన్నవరం ఎయిర్పోర్ట్ పనుల్లో టెర్మినల్ కాంట్రాక్ట్ ను వంశీ అనుచరుడికి ఇచ్చారని, తాను యుద్ధం చేస్తే ఇదేనా పార్టీ ఇచ్చే గిఫ్ట్ అంటూ యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టాయంటున్నారు. అసలు ఎయిర్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన కాంట్రాక్ట్‌లను యార్లగడ్డ సొంత పార్టీకి అంట కట్టడంపై కూడా టీడీపీ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

 

ఇక ఈ ఇద్దరి తర్వాత విజయవాడ సెంట్రల్‌ నుంచి గెలిచిన బోండా ఉమా వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. కాపుల విషయాన్ని టిడిపి మొదటి నుంచి అత్యంత సున్నితమైన వ్యవహారంగా చూస్తోంది. కానీ… బోండా సరిగ్గా అదే పాయింట్‌ని టచ్‌ చేయడం, ముద్రగడ సంస్మరణ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపెట్టిందట. ఆయన్ని పిలిచి వివరణ తీసుకోవాలని అధిష్టానం ఆదేశించడం, ఉమా వెళ్ళి పార్టీ కమిటీకి క్లారిఫికేషన్‌ ఇవ్వడం చకచగా జరిగిపోయాయి. ఇలా… ఒకరి తర్వాత ఒకరుగా జిల్లా ఎమ్మెల్యేలు వివాదాస్పదం అవుతుండటం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందట. ఒకరి వల్ల మొదలైన తలనొప్పి తగ్గుతున్న సమయంలో మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడంలాంటి వాటిని అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తోందట. ఈ క్రమంలో ఇకపై శాసనసభ్యులు ఏది పడితే అది మాట్లాడకుండా కఠినంగా వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం డిసైడైనట్టు తెలుస్తోంది.