ఆ మాజీ మంత్రి సొంత ఇంట్లోనే పరాయి వాడై పోయాడా? అట్టహాసంగా పార్టీ నాయకుడి పదవీ స్వీకార కార్యక్రమం జరిగితే… ఆయన్ని కనీసం పిలిచే దిక్కు లేకుండా పోయిందా? కాకితో కబురంపితే వెళ్తామనుకున్నా… కనీసం ఆ కాకి కూడా కరవైపోయిందా? ఎవరా సీనియర్ లీడర్? ఎందుకాయన పరిస్థితి మరీ… అంత దయనీయంగా మారిపోయింది? ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ… ఒడా ఛైర్మన్‌గా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు. పదవీ స్వీకార కార్యక్రమాన్ని కూడా మాంఛి… అట్టహాసంగా నిర్వహించారు. పార్టీకి చెందిన కీలక నేతలు, టీడీపీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలంతా అటెండయ్యారు. అయితే ఏంటంట? అదంతా రొటీనే కదా… ఇప్పుడు కొత్తగా చెప్పొచ్చేది ఏంటంటారా? జస్ట్ వెయిట్. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఒడా ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతా హాజరయ్యారుగానీ… అదే…. జనసేనలో ఉన్న కీలక నాయకుడు, ఒంగోలు నియోజకవర్గానికే చెందిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కనీసం కాకితో కూడా కబురు పెట్టలేదన్న వ్యవహారం పొలిటికల్‌గా కలకలం రేపుతోంది. అంతేకాక రియాజ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడా బాలినేని ఫోటో కనీసం చిన్నదిగా కూడా వేయకపోవడం చర్చనీయాంశం అయ్యింది. దీని మీద బాలినేని వర్గం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోందట. వైఎస్ కుటుంబ బంధువైన బాలినేని.. 2019 జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రెండున్నరేళ్ల తర్వాత పునర్‌వ్యవస్థీకరణలో బాలినేనిని తప్పించారు జగన్. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారాయన. అటు నియోజకవర్గంలో పుష్కర కాలంగా బాలినేని, టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది.నాలుగుసార్లు ఇద్దరూ ముఖాముఖి తలపడగా చెరో రెండుసార్లు గెలిచారు. అయితే… 2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒకే కూటమిలో ఉన్నా… బాలినేని, దామచర్ల మధ్య వైరం ఏ మాత్రం తగ్గలేదు. మాజీమంత్రి జనసేనలో చేరే సందర్భంలో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల. ఆ టైంలో ఫ్లెక్సీల చించివేతలు కూడా జరిగాయి. కూటమి అన్నాక కొన్ని సర్దుబాట్లు తప్పనిసరని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో చెప్పాక కూడా మాజీ మంత్రి అనుచరులు పెట్టిన హరిహరవీరమల్లు సినిమా ఫ్లెక్సీలను తొలగించటం హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామ క్రమంలో తాజాగా ఒడా ఛైర్మన్ పదవీ ప్రమాణ కార్యక్రమం గ్యాప్‌ను మరింత పెంచిందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అధికారిక కార్యక్రమం, పైగా సొంత పార్టీ నాయకుడు ఛార్జ్ తీసుకుంటున్న సందర్భం.
అయినా సరే… మాజీ మంత్రికి ఆహ్వానం పంపకపోవడం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇన్నాళ్ళు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్న వార్… ఇప్పుడు జనసేన వర్సెస్ జనసేనగా మారిపోయిందని అంటున్నారు. ఒకటి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసుండే జనసేన గ్రూప్‌కాగా… రెండోది బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రూప్‌గా విడిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల కృషివల్లే తనకు ఒడా ఛైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆహ్వానాలను కూడా ఆయన చెప్పినట్టే పంపారట. అందుకే సొంత పార్టీ నేత అయినా… బాలినేనికి కనీస పిలుపులు లేకపోగా…ఫ్లెక్సీల్లో ఎక్కడా ఆయన ఫోటో సైతం కనిపించలేదంటున్నారు. అలాగే బాలినేనితో కలివిడిగా ఉంటున్న జనసేన ఏకైక కార్పొరేటర్ ములగా రమేష్, ఆ పార్టీ మహిళా నేత రాయపాటి అరుణకు కూడా ఆహ్వానాలు వెళ్లలేదట. ఒంగోలులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించినా… జనసేనలో ఓ వర్గం అంటూ తమను పక్కన పెట్టడంపై వాళ్ళు కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నట్టు తెలిసింది.
మరోవైపు అదేసభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేనిని మరోసారి టార్గెట్ చేసి మాట్లాడటం కూడా వివాదాస్పదం అవుతోంది. ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చిన వారికి అంత ప్రాధాన్యత ఇవ్వల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు దామచర్ల. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడటంపై కూడా చర్చించుకుంటున్నారట ఒంగోలులో. ఈ క్రమంలో… ఒంగోలు పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట జనసేన నేతలు. ఇది పార్టీలో కూడా వర్గపోరుకు దారి తీస్తుందని, తీవ్రంగా డ్యామేజ్ జరుగుతుందని భావిస్తోంది ఒంగోలు జనసేనలోని ఓ వర్గం. అటు బాలినేని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉందంటున్నారట. మొత్తంగా దీన్ని చూస్తుంటే ఒంగోలు కూటమిలో రచ్చ రంబోలా అయ్యేట్టే ఉందంటున్నారు పరిశీలకులు.
