Site icon NTV Telugu

Off The Record: ఎంపీ సీటుపై గురిపెట్టారా?

Maxresdefault (1)

Maxresdefault (1)

ఆ ఎమ్మెల్సీ అదే డిసైడ్ అయ్యారా.? అందుకే పార్లమెంట్ సీటుపై గురిపెట్టారా.? l Off the Record l NTV

ఆ ఎమ్మెల్సీ పోయిన చోటే వెదుక్కోవాలని డిసైడయ్యారా? అందుకే పార్లమెంట్ సీటు మీద గురిపెట్టారా? ఈసారి అసెంబ్లీ బరిలో ఉంటారన్న ప్రచారంలో నిజమెంత? మాజీ ఎంపీ, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ విషయంలో గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?

హైదరాబాద్‌ టు ఢిల్లీ వయా నిజామాబాద్‌?
బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల్లో ఒకరైన కల్వకుంట్ల కవిత మళ్ళీ లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా.. నిజామాబాద్‌ లోక్‌సభ సీటు మీద ఫోకస్‌పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట ఆమె. జగిత్యాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని క్యాడర్‌కు నేనున్నానే భరోసా ఇచ్చారట. ఇటు నిజామాబాద్ సిట్టింగ్‌ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు పై మాట తప్పారంటూ…. పసుపు రంగు ప్లెక్సీలు ఏర్పాటు చేయడం… యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు పంపడమేనంటున్నారు. ఎంపీ అర్వింద్ ను వెంటాడి, వేటాడి ఓడిస్తానంటూ గతంలో ఛాలెంజ్‌ చేసిన కవిత.. అందులో భాగంగానే నిజామాబాద్ లోక్‌సభ బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈడీ కేసుల విచారణ తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాలలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కవిత. అలాగే ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న మరో రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో జరిగే సమావేశాల్లో కూడా పాల్గొనేలా కార్యచరణ రూపొందించారట. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి.. జిల్లాలో మరింత యాక్టివ్ రోల్ పోషించాలని డిసైడ్ అయ్యారట ఎమ్మెల్సీ. ఇటు టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారడంతో.. జాతీయ రాజకీయాల్లో కవితకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్‌ సైతం సుముఖంగా ఉన్నారట. ఆ క్రమంలోనే ఆమెను నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో దింపాలని యోచిస్తున్నారట కేసీఆర్‌.

ఎంపీ అర్వింద్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలన్న పట్టుదల
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత.. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పొలిటికల్‌గా కొంచెం సైలెంట్ గా ఉన్నా.. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిచి శాసన మండలిలో అడుగు పెట్టారామె. ఇక పోగొట్టుకున్న చోటే.. వెదుక్కోవాలన్న పట్టుదలతో నిజామాబాద్ ఎంపీ సీటు మీద ఫోకస్ చేస్తున్నారట. లోక్ సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా.. కవిత మాత్రం ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్దానాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచేలా ప్లాన్‌ చేసి.. ఆ బాధ్యతను తానే తీసుకోవాలనుకుంటున్నారట కవిత. ఎంపీ అర్వింద్ ను ఓడిస్తానని ప్రకటించిన ఎమ్మెల్సీ… అందుకు అనుగుణంగా ఆయన ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్ధిని పెట్టి .. ఓడించాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే తానే నేరుగా…రిటర్న్ గిప్ట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నారట.

అసెంబ్లీ బరిలో కవిత?
ఇదంతా ఒక ఎత్తయితే…కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారన్న మరో వార్త ప్రచారంలో ఉంది. నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగే ఛాన్స్‌ ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ….వాటిని పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. ఆమె గురి మొత్తం లోక్‌సభ సీటు మీదే ఉందన్నది లోకల్‌ టాక్‌. స్థానికంగా ఉండే ఎమ్మెల్సీ సన్నిహితులు కూడా..ఇదే విషయం చెబుతున్నారట. మొత్తంగా చూస్తే… కవిత ఈసారి ఎంపీగా గెలిచి బీఆర్‌ఎస్‌ తరపున జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట.

Exit mobile version