Site icon NTV Telugu

Off The Record: సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై

Maxresdefault (7)

Maxresdefault (7)

ప్రోటోకాల్ విషయం తేల్చండి..CM KCR Vs Guv Tamilisai | OTR | Ntv

తెలంగాణలో గవర్నర్‌.. అధికారపార్టీ మధ్య మరోసారి కత్తులు దూసుకునే సమయం వచ్చిందా? రిపబ్లిక్‌ డే.. పెండింగ్‌ బిల్లులు.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మాటల మంటలు రాజేయబోతున్నాయా? గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వార్‌ ముదురు పాకాన పడినట్టేనా?

రాజ్యాంగ వ్యవస్థల మధ్య మాటల తూటాలు
రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో తెలంగాణలో రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య చాలా గ్యాప్‌ వచ్చేసింది. అది ఇంకా పెరుగుతూ వెళ్తోందే తప్ప సమసే పరిస్థితులు కనిపించడం లేదు. సమయం సందర్భం వచ్చిన ప్రతీసారీ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన BRS తొలి బహిరంగ సభలో గవర్నర్లను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రులు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ముందుగా ప్రొటోకాల్‌ విషయం తేల్చాలని స్వరం పెంచారు గవర్నర్‌. దాంతో మళ్లీ పొలిటికల్‌ పిక్సర్‌ వాడీవేడీగా మారిపోయింది.

రిపబ్లిక్‌ డేపై సమాచారం లేదన్న గవర్నర్‌
ఇక ముందు కూడా పలు అంశాలు రాజ్‌భవన్‌కు, రాష్ట్ర సర్కార్‌కు మధ్య ఇంకా గ్యాప్‌ తీసుకు రావొచ్చన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం రిపబ్లిక్‌ డేపై చర్చ సాగుతోంది. గణతంత్ర దినోత్సవంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు గవర్నర్‌ తమిళిసై. గతంలో పబ్లిక్‌ గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్‌ డే ఉత్సవాలు నిర్వహించేది. తర్వాత కరోనా కారణంగా రిపబ్లిక్‌ ఉత్సవాలు రాజ్‌భవన్‌కే పరిమితం అయ్యాయి. రాజ్‌భవన్‌లో జరిగిన పలు కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అప్పట్లోనే అది పొలిటికల్‌గా చర్చకు దారితీసింది. ఇప్పుడు రిపబ్లిక్‌ డే ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? దానిపై గవర్నర్‌ ఎలా స్పందిస్తారో? అనే ఉత్కంఠ నెలకొంది.

పెండింగ్‌లో ఉన్న బిల్లులపై రచ్చ
ఇప్పటికే గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులపై రాజ్‌భవన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. అయితే బిల్లుల పెండింగ్‌పై ఎప్పటికప్పుడు తన అభ్యంతరాలను వినిపిస్తున్నారు గవర్నర్‌. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. సాంకేతిక కారణాలతో గతంలోనే గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్‌ అవుతుందా అనే సందేహాలు ఉన్నాయి. మొత్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్లపై ఏదో ఒక అంశంపై చర్చ.. రచ్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న కేరళ.. తర్వాత తమిళనాడులో గవర్నర్ల తీరుపై అక్కడి ప్రభుత్వాలు విమర్శలు చేశాయి. అక్కడ వేడి చల్లారక ముందే ఇప్పుడు తెలంగాణలో మళ్లీ రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారుతోంది.

Exit mobile version